Woman Cultivating Food Crops on Terrace : రంగురంగుల పూలమొక్కలు, ఆరోగ్యకరమైన ఆహారాన్నిచ్చే కూరగాయలు, ఆయుర్వేద మందులను అందించే ఔషధ మొక్కలు, స్వచ్ఛమైన గాలిని అందించే చెట్లు ఇలా చూడముచ్చటమైన ఈ మిద్దెతోటను చూశారా? నల్గొండకి చెందిన ప్రకృతి ప్రేమికురాలు కవిత సృష్టించిన వనం ఇది. సేంద్రీయ కూరగాయలు పండించడానికి, ఈ మిద్దెసాగును మెుదలుపెట్టారు.
కొంచెం అభిరుచి, ఇంకొంచెం ఆలోచన. మరికొంచెం ఓపిక ఉంటే చాలు ఇంటిని నందనవనంలా మార్చేయవచ్చని నిరూపించింది ఈ మహిళ. ఇంట్లోకి అవసరమైన పండ్లు, పూలు, కూరగాయలు ఈ మేడపైనే పండిస్తోంది. అక్కడితో ఆగకుండా కమ్యూనిటీ గార్డెన్‌ని ప్రారంభించి చుట్టు పక్కల వారితో పాటు అనాథ ఆశ్రమాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అంగాన్ వాడీ కేంద్రాలకు ఉచితంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పంపిణీ చేస్తుంది కవిత.
3 ఏళ్ల క్రితం మిద్దెసాగును ప్రారంభించిన దంపతులు :కవితకు చిన్నప్పటి నుంచి మెుక్కలు, పర్యావరణ పరిరక్షణ అంటే ఇష్టం. అ ఆసక్తితోనే పిట్టగోడ మీద చిన్న చిన్న కుండీలు ఏర్పాటు చేసుకుని మొక్కలు పెంచేది. వివాహమైన తర్వాత భర్త శ్రీనివాస్‌కు కూడా పర్యావరణం, మెుక్కల పెంపకంపై ఆసక్తి ఉండటంతో, ఇద్దరు కలిసి 3 ఏళ్ల క్రితం మిద్దెసాగును ప్రారంభించారు. తాను చదువుకుంది బైపీసీ కావడంతో మెుక్కలపై మరింత మక్కువ, అభిరుచి ఏర్పడిందని అంటోంది.
ఇంటిపై కప్పునే సాగు ప్రయోగశాలగా మలచి : రంగు రంగుల పూల సోయగాలు, వివిధ రకాల కూరగాయలు, రుచికరమైన పండ్లు ఇలా ప్రకృతిమాత ఒడి నుంచి జాలువారిన మొక్కలతో తమ ఇళ్లను పొదరిల్లులా మార్చేశారు ఈ దంపతులు. సహజంగా నగరాల్లో మొక్కలు పెంచటానికి అవసరమైన స్థలం ఉండదు. అయితే మనసు పెడితే మార్గం ఉంటుంది. ఏకంగా తమ ఇంటిపై కప్పుని సాగు ప్రయోగశాలగా మార్చుకున్నారు. మిద్దెసాగు పేరిట ఇటీవలి కాలంలో వచ్చిన నూతన ఒరవడిని అందిపుచ్చుకుని ఆరోగ్యకరమైన జీవనానికి బాటలు వేసుకున్నారు.
ఇంటి కింది భాగం నుంచి మెట్లు, స్లాబ్ వరకు కుండీల్లోనే విభిన్న రకాల పూలు, కూరగాయల మొక్కలు సాగు చేస్తున్నారు. వీరు టమాటా, వంకాయ, బెండ, దొండ, కాకర, బీర తదితర కూరగాయలతో పాటు జామ, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్ల మొక్కలు, గులాబి, మందారం, నందివర్దనం, గరుడ వర్థనం, మందారం, మంకెన, బంతి, చామంతి వంటి పూల మొక్కలను కూడా పెంచుతున్నారు. అంతేగాక నిమ్మగడ్డి, తులసి, అల్లోవేరా వంటి ఔషధ మొక్కలను కూడా పెంచుతున్నామని చెబుతున్నారు.
Free Distribution of Vegetables to Anganwadi Centers :మిద్దెతోట కోసం చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలతో పాటు నల్లటి సంచులు, డ్రమ్ములను కొనుగోలు చేశారు ఈ దంపతులు. మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎక్కువగా మట్టి ఉండాలి. అందుకే పెద్ద డ్రమ్ములను ఉపయోగించారు. మొక్కలకు పోసిన నీరు డ్రమ్ము కింది భాగంలోని రంధ్రాలతో కిందకు పోయినా, స్లాబ్ ఫ్లోరింగ్ పాడైపోకుండా తగిన చర్యలు చేపట్టారు.