Musi Catchment Survey :చట్టానికి లోబడి హైడ్రా, అధికారులు పనిచేస్తున్నారని మూసీ ప్రాజెక్టు ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మూసీ నిర్వాసితులను ఎవరినీ బలవంతంగా తరలించడంలేదని ఆయన స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులతో సామరస్యంగా మాట్లాడి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తరలిస్తున్నామని, నిర్వాసితుల్లో దాదాపు 90 శాతం మంది ఖాళీ చేసేందుకు సుముఖుత వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మూసీ నిర్వాసితుల్లో ఎవరికైనా పట్టాలు ఉంటే రెట్టింపు ధర ఇస్తున్నట్లు తెలిపారు.
మురికి కూపంలా మూసీ : హైదరాబాద్‌లో 1927లో మూసీకి వచ్చిన వరదల వల్ల భారీ నష్టం జరిగిందని దాన కిశోర్ పేర్కొన్నారు. గతంలోనూ నిర్వాసితులను తరలించారని తెలిపారు. హైదరాబాద్‌లో ఇటీవల దాదాపు 9 సెం.మీ పైగా వర్షాలు వచ్చాయని, చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపునకు గురవుతోందన్నారు. గతంలో మూసీ సుందరీకరణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కోటి జనాభా ఉందని, మూసీ పరివాహక ప్రాంతం మురికికూపంలా మారిందన్నారు. దానిని మార్చాలని దానకిశోర్ స్పష్టం చేశారు.
Musi River Encroachment :మూసీకి వరదలు వస్తే ఇబ్బందులు పడేది ప్రజలేనని దానకిశోర్ తెలిపారు. మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకొని క్షేత్ర పర్యటనకు వెళ్తామని పేర్కొన్నారు. మూసీ బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనని దాన కిశోర్ స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైన ఇళ్లను ఇస్తున్నట్లు దానకిశోర్ వెల్లడించారు
Hydra Ranganath on Buchamma Suicide :పేదలకు ఇబ్బంది చేయాలనేది హైడ్రా అభిమతం కాదని, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే సంస్థ లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన వాతావరణం అనేది రాజ్యాంగంలో భాగమని, పరిశుభ్రమైన వాతావరణం జీవించే హక్కులో భాగమని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని అందుకే ఆ బాధ్యత హైడ్రాకు ఉందని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కొన్ని కట్టడాలను కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తుందని కితాబు ఇచ్చారన్నారు. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశామని రంగనాథ్ వివరించారు.