Murder Mystery In East Godavari District : తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంకు చెందిన ధాన్యం వ్యాపారి కేతమల్ల పూసయ్య అలియాస్ వెంకటేశ్వరరావు ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లారు. కొంత సేపటికి పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అకస్మాత్తుగా మంటలు రావడంతో గమనించి స్థానికులు అక్కడికి వెళ్లారు. అక్కడ మంటల్లో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృత దేహం కనిపించింది. అక్కడే పూసయ్య చెప్పులు, బైక్ గమనించి కరెంట్ షాక్ తో ఆయన చనిపోయాడని గ్రామస్థులు భావించారు. తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కూడా గ్రామస్థుల వాదనతో ఏకీభవించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియలో మునిగిపోయారు.
'అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎలా కనిపెట్టారు సార్..!'
Three Persons Killed Unknown Person in AP :పూసయ్య బంధువులు, ఇరుగుపొరుగు అంతా అంత్యక్రియల కోసం గ్రామానికి చేరుకున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. పోస్టుమార్టం పూర్తయ్యాక ఆసుపత్రి నుంచి మృతదేహం ఇంటికి చేరడమే ఆలస్యంగా ఉంది. ఇంతలో పూసయ్య ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తికి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తాను పూసయ్యను మాట్లాడుతున్నానని, తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి, ఆటోలో తరలించి, రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి వద్ద పొలాల్లో పడేశారని పేర్కొన్నాడు. తీవ్ర గాయాలతో అవస్థ పడుతున్నానని, తనను తీసుకెళ్లాలని అభ్యర్థించాడు. ఈ ఫోన్ కాల్తో ఒక్కసారిగా ఖిన్నులైన కుటుంబ సభ్యులు, ఫోన్ లో మాట్లాడుతుంది పూసయ్యేనని నిర్ధారించుకుని, సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. ఈ సమాచారంతో ఈ సారి అవాక్కవడం పోలీసుల వంతైంది. పూసయ్య చనిపోలేదని నిర్ధారించుకున్న వారికి, మరి చనిపోయిన మృతదేహం ఎవరిదని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో చనిపోయిన వ్యక్తి మృతదేహం ఎవరిదనే దానిపై దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసులు క్లూస్ టీం డాగ్ టీంలను రంగంలోకి దించారు. చనిపోయాడని భావించిన వ్యక్తి బతికి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులు తగలబెట్టిన మృతదేహం మిస్టరీ తేలాల్సి ఉంది.