Munneru Floods Damaged Schools : గత నెల 30, 31న కుండపోత వర్షాలు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముంచెత్తిన వరదలు ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ విద్యాలయాలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. జిల్లాలోని 16 మండలాల్లోని సరస్వతీ నిలయాలు వరదల ధాటికి పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయాయి. నిరుపేద విద్యార్థుల చదువులకు అండగా ఉంటున్న ప్రభుత్వబడులు ఇప్పుడు కళావిహీనంగా మారి బోధన సాగే పరిస్థితి లేకుండా పోయాయి. జిల్లాలో మొత్తం 68 ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతిన్నాయి. కొన్ని బడులకు ప్రహారీ గోడలు కూలిపోయాయి. కొన్నింటికి పైకప్పు బీటలు వారాయి. తాగునీటి ట్యాంకులు కొట్టుకుపోయాయి. మినరల్ వాటర్ ప్లాంట్లు బురదలో కూరుకుపోయాయి. పాఠశాల ఆవరణలు ఇప్పటికీ మోకాలు లోతున బురదమయంగా మారాయి.
పాడైన టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు : మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని ప్రభుత్వ విద్యాలయాల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. ప్రధానంగా ఖమ్మం గ్రామీణంలో 10, ఖమ్మం అర్బన్‌లో 10 పాఠశాలలపై వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. ఆయా పాఠశాలలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 10 అడుగుల మేర నీరు ప్రవహించడంతో తరగతి గదుల్లో మూడు, నాలుగు అడుగుల మేర బురద పేరుకుపోయింది. కంప్యూటర్లు, విలువైన సామాగ్రి, పుస్తకాలు, రికార్డులు తడిసి ముద్దయ్యాయి. డిజిటల్ విద్య కోసం ఏర్పాటు చేసిన లక్షలు విలువజేసే టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు వరదల్లో మునిగి పాడైపోయాయి.
పాడైన వేల పుస్తకాలు : దాదాపు 8 వేల మంది విద్యార్థుల పుస్తకాలు వరద పాలయ్యాయి. పాఠశాలల్లో నిల్వ ఉన్న పుస్తకాలు కూడా తడిసి ముద్దయ్యాయి. ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్స్ మొత్తం పాడైపోయాయి. ఫలితంగా పాఠం చెప్పడం కూడా కష్టంగా మారింది. ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు ఇప్పుడే పాఠశాలలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. వీరు పాఠశాలకు వెళ్లినా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు లేవు. మధ్యాహ్న భోజనం కోసం తెచ్చిన క్వింటాళ్ల కొద్దీ బియ్యం తడిసి ముద్దయి ముక్కిపోయాయి.