Mumbai Actress Harassment Case: ముంబై సినీనటి కేసులో నిందితుడిగా ఉన్న నిఘా మాజీ విభాగాధిపతి సీతారామాంజనేయులుని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని సీఐడీని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అతను ముందస్తు బెయిలు పిటిషన్ కూడా దాఖలు చేయలేదని గుర్తుచేసింది. సినీనటి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం IPSలు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 7న నిర్ణయాన్ని వెల్లడిస్తామంది.
అది దర్యాప్తు అధికారి విచక్షణాధికారం: ముంబయి సినీనటి ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో సీతారామాంజనేయులను ఎందుకు అరెస్టు చేయలేదని సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. కేసులో 2వ నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం అందుబాటులో ఉన్నారా? లేక పారిపోయారా? అని ఆరా తీసింది. మొత్తం వ్యవహారంపై వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఏజీ బదులిస్తూ, అరెస్ట్ వ్యవహారం దర్యాప్తు అధికారి విచక్షణాధికారమని చెప్పారు. వాస్తవాలను రాబట్టేందుకు కేవలం అరెస్టే మార్గం అనుకుంటే అరెస్ట్ చేస్తారన్నారు. కొందర్ని అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి, తమకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పిటిషనర్లు కోరడానికి వీల్లేదన్నారు.
జనవరి 7న బెయిలు పిటిషన్లపై నిర్ణయం: నిందితులను వరుసక్రమంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం దర్యాప్తు అధికారికి లేదన్నారు. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ముంబయి నటిపై కేసు నమోదు, అరెస్ట్ వెనుక కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు నిందితుల కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమన్నారు. ముందస్తు బెయిలు పిటిషన్లను కొట్టేయాలని కోరారు. ఇరువైపు వాదనలు ముగియడంతో జనవరి 7న బెయిలు పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే.కృపాసాగర్ తెలిపారు.