MRPS Leader Kidnap Case Update: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఇటీవల కిడ్నాప్‌నకు గురైన ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నరేందర్‌ను కిడ్నాప్ చేసి శంషాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌లో బంధించినట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు. బాధితుడు నరేందర్‌ను కిడ్నాప్ చేశాక శునకాలతో బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకోవైపు ఫామ్‌హౌస్ అనుమతి లేని ప్రాంతంలో నిర్మించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కిడ్నాప్‌నకు సంబంధించి ఇప్పటికే నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ముగ్గురి పాత్రపై ఆరా తీస్తున్నారు.
కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి :నార్సింగిలోని బృందావన్ కాలనీలో హరికృష్ణ అనే వ్యక్తికి చెందిన 1,000 గజాల భూమిని పాత నేరస్థులతో కూడిన ఓ మాఫియా ఆక్రమించింది. ఈ నెల 10న హరికృష్ణ ఆదేశాలతో ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్, అతని స్నేహితుడు ప్రవీణ్ ఆ స్థలం వద్దకు వెళ్లి మాఫియాను ప్రశ్నించారు. ఈ క్రమంలో మాఫియా దుండగులు వీరిద్దర్నీ కిడ్నాప్ చేశారు. రెండు రోజుల పాటు నగరంలో వివిధ ప్రాంతాలకు తిప్పుతూ శంషాబాద్‌లోని ఫామ్‌హౌజ్‌లో బంధించి, చిత్రహింసలు పెట్టారు. ఈలోపు పోలీసులు దర్యాప్తు ప్రారంభించడం, మాఫియాలోని నలుగుర్ని అరెస్టు చేయడంతో మిగిలిన నిందితులు నరేందర్, ప్రవీణ్‌లను శుక్రవారం ఉదయం వదిలిపెట్టారు.
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు :నార్సింగి పోలీసులు బాధితులను వెంటతీసుకుని శంషాబాద్ ఫామ్‌హౌస్ వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ దాదాపు 30 శునకాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్‌హౌస్ ఉన్న స్థలాన్ని కూడా కబ్జా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు కిడ్నాప్‌నకు ఉపయోగించిన కారు కూడా అపహరించినదేనని దర్యాప్తులో తేలింది. కిడ్నాప్‌లో పాల్గొన్న నలుగుర్ని ఇప్పటికే అరెస్ట్ చేశామని, మరికొందరి పాత్రపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు గతంలోనూ కొన్ని నేరాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫామ్‌హౌస్‌లో పదుల సంఖ్యలో శునకాల్ని ఎందుకు పెంచుతున్నారో ఆరా తీస్తున్నారు.