Madanapalle Sub Collector Office Case Updates :మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం గుట్టును మీటర్ రీడింగ్ ఇన్స్ట్ర్మెంట్ డేటా విప్పింది. ఘటన జరిగిన సమయంలో అంతకుముందు మూడు రోజుల్లోనూ కార్యాలయానికి సరఫరా అయ్యే విద్యుత్ లోడ్‌లో అసాధారణ హెచ్చుతగ్గులేమీ లేవని తేల్చింది. ప్రతి సర్వీసుకూ 15 నిమిషాల వ్యవధిలో సరఫరా అయ్యే కరెంట్ లోడ్ వివరాలు ఎంఆర్అఐ సర్వర్‌లో ఉంటాయి. ఆ డేటాను విశ్లేషించిన తర్వాత షార్ట్ సర్క్యూట్‌కు ఆస్కారమే లేదని నిపుణుల బృందం తేల్చింది.
Madanapalle Fire Accident Case :దీంతో పాటు కార్యాలయానికి సరఫరా జరిగే త్రీఫేజ్ కరెంట్ సర్వీస్ వైరు కూడా ఎక్కడా దెబ్బతినలేదని గుర్తించింది. ప్రమాద తేదీకి మూడు రోజుల ముందు నుంచి విద్యుత్ లోడ్ లెక్కలను ఆ శాఖ బయటకు తీసింది. కార్యాలయంలోని కంప్యూటర్ సెక్షన్‌లో ఈ నెల 21న అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దస్త్రాలు రాలిపోయిన ఘటనలో శాఖాపరంగా ఏమైనా లోపాలు ఉన్నాయా? అన్న ఆంశంపై విద్యుత్ సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించింది. అక్కడ గుర్తించిన అంశాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
అసాధారణ హెచ్చుతగ్గులేమీ లేవని వెల్లడి :డేటాలో ఎలాంటి అసాధారణ పెరుగుదలా నమోదు కాలేదని తేల్చింది. సబ్‌కలెక్టర్ కార్యాలయానికి త్రీఫేజ్ కనెక్షన్ ఉంది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి 11:14 గంటల సమయంలో ఆర్-ఫేజ్‌లో 2.62 యాంప్స్ లోడ్ ఉంటే, అదే రాత్రి 22:44 గంటలకు 2.13 యాంప్స్‌గా ఉందని తెలిపింది. వేకువజామున 12:14 గంటలకు ఆర్-ఫేజ్‌లో 0.27 యాంప్స్ లోడ్‌కు పడిపోయిందని పేర్కొంది. పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో 21న రాత్రి 11:25 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. అంటే అగ్నిప్రమాదం తర్వాత లోడ్ ఒక్కసారిగా పడిపోయిందని తేల్చారు.