Movie Theaters in Losses :ఓ థియేటర్లో ఏదైనా సినిమా వంద రోజులు ఆడిందంటే అదో గొప్ప విషయం. కానీ ఇప్పుడు సినిమాలు లేక థియేటర్లన్నీ వెలవెలబోతూ వందరోజులు దాటటం గమనార్హం. ప్రజలకు విజ్ఞానం, వినోదం ఇచ్చే కళారూపాలలో సినిమా ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 1100వరకూ ధియేటర్లు ఉన్నాయి. వీటిమీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి. సినిమా థియేటర్ల దగ్గర సందడి కనిపించి 100రోజులు దాటిపోయింది. చిన్నబోయిన రంగుల తెర మళ్లీ కళకళలాడాలంటే అగ్ర తారలు వరుస పెట్టి సినిమాలు తీయాల్సిందే.
Cinema Theaters Close in Telangana :వేసవి సెలవుల్లో ప్రేక్షకులతో కళకళలాడే సినిమా థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అగ్రతారల సినిమాలు కూడా లేకపోవడంతో థియేటర్ల దగ్గర సందడి కనిపించి దాదాపు 100 రోజులు దాటేసింది! తెలుగు చిత్ర పరిశ్రమలో వేసవి సీజన్ మొదలయ్యేది ఉగాది సినిమాల నుంచే. పండగకి అగ్ర హీరోల చిత్రాలొస్తుంటాయి. అక్కడి నుంచి వేసవి సందడి మొదలవుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వేసవి సీజన్ కొనసాగుతుంది. విద్యార్థులకి సెలవులు ఉండడం, ప్రేక్షకులు కూడా థియేటర్లకి వెళ్లేందుకు అనువుగా భావించడంతో ఈ సీజన్‌లో సినిమాలు మంచి వసూళ్లని సొంతం చేసుకుంటుంటాయి.
Cinema Theaters Face Revenue Loss :దర్శకనిర్మాతలు ప్రత్యేకంగా ఈ సీజన్‌నే లక్ష్యంగా చేసుకుని సినిమాల్ని విడుదల చేయడానికి మొగ్గు చూపుతుండటానికి ఇదో కారణం. కానీ ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. ఐపీఎల్ సీజన్‌తోపాటు అగ్రతారల కొత్త చిత్రాలేవీ ఈ సీజన్‌లో విడుదలకు నోచుకోలేదు. ఓటీటీలు, పైరసీల దెబ్బకు చిన్నిచిత్రాల్ని థియేటర్‌కు వెళ్లి చూడాలనే ఆసక్తి తగ్గిపోయింది. అందుకే తెలంగాణలో ఏకంగా సింగిల్ థియేటర్లలో తాత్కాలికంగా షోలు ఆపేశారు. రాష్ట్రంలోనూ సింగిల్ థియేటర్లు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ థియేటర్లకు పూర్వ వైభవం రావాలంటే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వమైనా చేయూతనివ్వటంతో పాటు, వరుస సినిమాలు విడుదల కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో సింగల్ థియేటర్లు మూతబడటం ఖాయమని వారు వాపోతున్నారు.