Mother And Son Duo Appear For ITI Classes :ఈ రోజుల్లో చదువుకోవడానికి చిన్నా, పెద్దా అడ్డు రాదు. చదువుకునే వయసులో కొన్ని పరిస్థితుల వల్ల చదువుకోలేక పోతున్నారు. కానీ కుటుంబ ప్రోత్సాహంతో పెళ్లిళ్లు అయ్యి, పిల్లలు పెద్దయ్యాక కూడా చదువుకొని పెద్ద పెద్ద హోదాలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి కోవకే చెందుతారు పెద్దపల్లి జిల్లాకు చెందిన తల్లీకుమారుడు.
తల్లి, కుమారుడు క్లాస్‌మేట్స్ : పై చిత్రంలో కనిపిస్తున్న తల్లి, కుమారుడు క్లాస్‌మేట్స్. ఉజ్వల భవిష్యత్తు కోసం కుమారుడిని డిప్లొమా కోర్సులో చేర్చించింది ఆ తల్లి. ఆ తర్వాత తానూ ఎందుకు నేర్చుకోకూడదని ఆలోచించారేమో కానీ ప్రవేశం తీసుకుని తనయుడితో కలిసి తరగతులకు హాజరవుతున్నారు. ఈ స్ఫూర్తిదాయకమైన ఉదంతానికి పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామం వేదికైంది.
ఐటీఐలో చదువుతున్న తల్లీకుమారుడు: 38 ఏళ్ల జక్కుల స్వర్ణ లతకు ఇంటర్మీడియెట్ చదివే సమయంలో పెళ్లయింది. భర్త లక్ష్మణ్ కూలీ పని చేస్తుంటారు. తన భార్య చదువు ఆగిపోవద్దని ఆమె చదువుకోవడానికి ప్రోత్సహించాడు. దీంతో ఆమె దూర విద్యలో డిగ్రీ, పీజీ చదివారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రోషన్‌ను ఐటీఐలో ఏడాది కాల పరిమితి కలిగిన కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులో చేర్పించాలని నిర్ణయించుకున్నారు.