Cause Of Hyderabad Road Accidents :హైదరాబాద్ రోడ్లు వరుస ప్రమాదాలతో నెత్తురోడుతున్నాయి. తప్పతాగి రోడ్డెక్కి కొందరు, మితిమీరిన వేగంతో మరికొందరు ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐటీ ఉద్యోగి బీభత్సం సృష్టించాడు. ఐకియా నుంచి కామినేని ఆసుపత్రి వరకు గంట వ్యవధిలో ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు. ఇందులో ఒకరు మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. వాహనం నడిపిన వ్యక్తికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో రీడింగ్ 550గా చూపించింది.
Road Accidents In Telangana :ఈ నెల 14న వనస్థలిపురంలో యూటర్న్ తీసుకుంటున్న కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఘటనలో రవి, ప్రణయ్ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోనే ఓ లారీ డ్రైవరు అర్థరాత్రి వేళ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వాహనదారుడు బంపర్‌కు వేలాడుతున్నా పట్టించుకోకుండా దూసుకెళ్లిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇక దుర్గం చెరువు తీగల వంతెనపైన వాహనదారుల తీరుతో తరచూ ప్రమాదాలుజరుగుతున్నాయి. ఇటీవల బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని ఇన్నోవా వాహనం ఢీ కొట్టి ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ కేసులో వాహనం నడిపిన నవీన్ అనే యువకుడు మద్యం సేవించినట్లు గుర్తించారు.
మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు :హైదరాబాద్ రోడ్లపై గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న బైక్ రేసింగ్‌లు కూడా ప్రాణాలు తీస్తున్నాయి. వేగంగా దూసుకెళ్తూ అవతలి వ్యక్తుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. శని, ఆదివారాల్లో ఐటీ కారిడార్, ఇతర ఖాళీ రోడ్లపై ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలపై రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. లైకుల కోసం ఈ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.