Most Common Reasons for Divorce :భార్యభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు విడాకులకు దారితీస్తున్న ఘటనలు అనేకం. నా భార్య ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతోందని, అందువల్లే మా మధ్య గొడవలు అంటూ ఓ భర్త ఫిర్యాదు చేస్తారు. నా భర్త రోజూ మద్యం తాగి ఇంటికొచ్చి గొడవ పడుతున్నాడు. ఇక నేను భరించలేను అంటూ ఓ భార్య ఆవేదనతో విడాకులకు దరఖాస్తులు చేస్తున్నారు.
ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్ల కుటుంబంతో హాయిగా ఆనందంగా ఉండాల్సిన బంధాన్ని కొందరు విడిచిపెడుతున్నారు. చాలా మంది దంపతుల్లో సర్దుకుపోయే గుణం మాయమవుతోంది. ఏళ్ల వివాహ బంధాలకు స్వస్తి పలికి పిల్లల బతుకులతో చెలగాటమాడుతున్నారు. అతి సున్నితమైన, చిన్న కారణాలతో తమ వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలకు సైతం వారు పరిష్కరించుకోకుండా పోలీసు స్టేషన్ గడప తొక్కుతున్నారు. ఇటువంటి సమస్యలు, ఫిర్యాదుల్లో యువ జంటలు కూడా ఉంటున్నాయి.
గృహ హింస నివారణ విభాగానికి వస్తున్న కేసుల్లో ఎక్కువ వీటివల్లే :
- పిల్లల ఇష్టా ఇష్టాలు తెలుసుకోకుండా తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేయడంతో వారు సర్దుకోలేక గొడవలు తయారవుతున్నాయి.
- ఆర్థిక సమస్యల కారణంగా కొన్ని బంధాలు తెగిపోతున్నాయి
- అత్తా, మామ, తోటి కోడల్లు, బావలు, ఆడపడుచులు ఇలా పెద్ద కుటుంబం ఉన్నా కొందరు మహిళలు సుముఖత చూపడం లేదు.
దంపతులు విడిపోతున్న వారిలో సుమారుగా 90 శాతం కేసుల్లో వారి మధ్య మనస్పర్థలకు, గొడవలకు చరవాణులు, అహం, అపోహలు, అక్రమ సంబంధాలు, మద్యం అలవాటు కారణమని పోలీసులు చెబుతున్నారు.
1. అహం : ప్రతీ వాదనలో నా మాటే చెల్లుబాటు కావాలనుకునే మనస్తత్వం. నేను లేకపోతే ఇల్లు నడవదు, నేను పని చెయ్యకపోతే పూట గడవదు, నా జీతంపై ఆధారపడే అంతా బతుకుతున్నారు. నా కష్టంతోనే కుటుంబం నడుస్తోంది. ఇలా అనుకుని ఎవరికి వారు అహం ప్రదర్శిస్తున్నారు. సారీ చెబితే అయిపోయే విషయాలను కూడా అహం వల్ల పోలీసుల వరకు తీసుకొస్తున్న కేసులు అనేకం.
2. అపోహలు :అపోహలు అశాంతికి దారితీస్తున్నాయి. ఏదో ఊహించుకుని ఇంకేదో మనసులో పెట్టుకొని మాట్లాడడం చేయిచేసుకోవడం వంటి కారణాలతో గొడవలు వస్తున్నాయి. ఏదైనా ఉంటే అడిగి నివృత్తి చేసుకోకుండా దెప్పిపొడవడం వల్ల గొడవలు జరుగుతున్నాయి.
3. చరవాణులు : భర్త ఎవరితోనే గంటల తరబడి మాట్లాడుతున్నాడని, భార్య ఫోన్లో తరచూ కొన్ని నంబర్లు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పే ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. వచ్చిన కేసుల్లో ఒక పాయింటు కచ్చితంగా ఫోన్ గురించి ఉంటోంది.