Telangana New Ration Cards :రాష్ట్ర ప్రభుత్వం రేపటి (జనవరి 26) నుంచే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించనుంది. అయితే ఇప్పటి వరకూ సరైన రీతిలో లబ్ధిదారుల ఎంపిక అనేది జరగడం లేదు. ముందుగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ఓ లిస్ట్‌ను ప్రాథమికంగా రెడీ చేయగా, ఇప్పుడు గ్రామ, వార్డు సభల్లో మళ్లీ వీటికి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ సభల్లో నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.
ఈ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈ నెల 21 నుంచి 24 వరకు పల్లెలు, పట్టణాల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించారు. అయితే పల్లెల్లో శుక్రవారమే గ్రామ సభలు ముగియగా, పట్టణాల్లో మాత్రం ఇవాళ (శనివారం) వరకు అధికారులు నిర్వహించనున్నారు. ఈ నెల 26 నుంచి అర్హులకు పథకాలు అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వాటికే ఎక్కువ దరఖాస్తులు : ముఖ్యంగా గ్రామ సభలు, వార్డు సభల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా రేషన్ కార్డుల కోసం వచ్చినవే అధికంగా ఉన్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వీటి కోసమే చాలా మంది లబ్ధిదారులు అర్జీలు పెట్టుకున్నారు. అధికారులు మాత్రం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో పల్లెల్లో 51,028 దరఖాస్తులు రాగా, పట్టణాల్లో 22,151 మంది వీటి కోసం దరఖాస్తు చేసుకున్నారు.