Fake Certificates in Software Field : విద్యార్హతలు నకిలీ, అనుభవం నకిలీ, ఇంటర్వ్యూ నకిలీ, చివరికి మనుషులూ కూడా నకిలీనే. సామాజిక మాధ్యమాల ద్వారా బహిరంగంగా జరుగుతున్న ఈ మోసం సాఫ్ట్‌వేర్ పరిశ్రమకు పెనుభూతంలా పరిణమించింది. భారతీయ విద్యార్థుల విశ్వసనీయతపై విదేశీ కంపెనీలు అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది.
ఓ మాఫియాలా తయారైంది : ఇంతింతై అన్నట్లు ఇప్పుడు నకిలీ వ్యవహారం ఒక మాఫియాలా మారింది. ఎంతగా అంటే సోషల్ మీడియాలో వివిధ సంస్థల పేర్లతో ‘నకిలీ’ని అమ్ముకుంటున్నారు. నకిలీ విద్యార్హత, అనుభవ పత్రాలనే కాదు నకిలీ ఇంటర్వ్యూలను కూడా ఏర్పాటు చేస్తామని బహిరంగ ప్రకటనలు ఇస్తున్నారు. వీటిలో కొన్ని ప్రకటనలు హైదరాబాద్ చిరునామాతో నడుస్తుండటం గమనార్హం.
ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉద్యోగం కావాలనుకునేవారు సంప్రదిస్తే చాలు మిగతావన్నీ తామే చూసుకుంటామంటూ ప్రకటనలతో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల అమెరికాలోని ఓ ఇంట్లో పదుల సంఖ్యలో భారతీయ విద్యార్థులను పట్టుకున్న విషయం తెలిసిందే. వారితో అక్రమంగా ఉద్యోగాలు చేయిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్ :కోవిడ్ తర్వాత నుంచి ఇంట్లో ఉండి పనిచేసుకోవడం ఎక్కువైంది. ఈ విధానం లాభదాయకంగా ఉండటంతో సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా ప్రోత్సహించాయి. దీన్ని అడ్డం పెట్టుకొని ఒక్కొక్కరు అధికంగా సంపాదించాలని రెండు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. దీనికి ‘మూన్‌లైట్ జాబ్’ అనే పేరు కూడా పెట్టారు. ఇప్పుడిది మరో దశకు చేరుకుంది.