Police Notice to Raj Pakala for Farmhouse Party Case : జన్వాడ ఫామ్‌హౌజ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీలో పాల్గొన్న రాజ్ పాకాల స్నేహితుడు, కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు. ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఫామ్‌హౌజ్‌లో గేమ్ ఆడినట్లు దర్యాప్తులో తేలితే మరో కేసు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఫామ్‌హౌజ్‌లో పార్టీ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు శనివారం అర్ధరాత్రి అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించిన సమయంలో అక్కడున్న సెల్‌ఫోన్‌ను ఓ మహిళ దాచి పెట్టింది. దానిని ఆదివారం నాడు విజయ్ మద్దూరి పోలీసులకు అప్పగించారు. అందులో ఉన్న డాటా అధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొకైన్ మత్తుపదార్ధాలు తీసుకొచ్చి విజయ్ మద్దూరికి ఎవరు ఇచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రాజ్ పాకాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ : మరోవైపు పోలీసుల నోటీసుల నేపథ్యంలో రాజ్ పాకాల రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తనను అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని పిటిషన్‌లో ఆయన కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పోలీసుల ఎదుట హాజయ్యేందుకు ఆయనకు రెండు రోజుల సమయం ఇచ్చింది. రాజ్ పాకాల తరఫున మయూర్‌రెడ్డి వాదనలు వినిపించగా, ఇంట్లో పార్టీ చేసుకుంటే అక్రమంగా పోలీసులు వచ్చి రైడ్ చేశారన్నారు. ఆయన కంపెనీలో పని చేసే ఉద్యోగికి డ్రగ్స్ పాజిటివ్ వస్తే రాజ్ పాకాలను నిందితుడిగా చేర్చారని కోర్టుకు వివరించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని, ఇవాళ ఉదయం 9.30కి నోటీసులు పంపించి.. 11 గంటలకు విచారణకు రమ్మన్నారని కోర్టుకు ఆయన తెలిపారు.