No Funds For Telangana Proposals In Union Budget 2024 :తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు దక్కలేదు. పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా దిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి వినతిపత్రం ఇచ్చినప్పటికీ బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపింది. కేటాయింపులపై రాష్ట్ర ఆర్థికశాఖ కేంద్రానికి విడిగా వివరాలను పంపింది. అయినా ప్రధాన ప్రాజెక్టులకు నిధులేవీ పెద్దగా రాలేదు. గత మూడేళ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్ల పద్దు కింద పూర్తిస్థాయిలో నిధులు రావడం లేదు.
నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇటీవల ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర పథకాల ద్వారా అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో నిధులు కేటాయించాలని కోరారు. దాదాపు పదేళ్లుగా విభజన హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న తెలంగాణకు ఈసారి కేంద్ర బడ్జెట్‌లోనూ నిరాశే మిగిలింది.
భారీగా యువతకు అవకాశాలు ఉండే కాజీపేట రైల్వేకోచ్‌ల కర్మాగారం, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి పెద్ద ప్రాజెక్టులను విభజన చట్టంలోని 13వ షెడ్యూలులోని పదో అంశంగా చేర్చారు. వాటికి కేంద్రం కరుణిస్తుందని ఆది నుంచి యువత ఎదురుచూస్తోంది. కానీ ఈసారీ మంజూరు కాలేదు. కోచ్‌ల కర్మాగారానికి అవసరమైన భూమి అందుబాటులో ఉంది. కాజీపేటలో రైల్వే జంక్షన్ ఉంది. ఇలా ఎన్నో సానుకూలతలున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆచరణ సాధ్యం కాదని కేంద్రం ఆది నుంచి వాదిస్తోంది. మరోవైపు ఈ మధ్యకాలంలోనే కోచ్‌ల కర్మాగారాన్ని గుజరాత్‌లో ఏర్పాటు చేసింది.
ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు - కుర్చీ బచావో బడ్జెట్ : సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth On Central Budget Funds
- విశాఖ ఉక్కు కర్మాగారంతో పోల్చితే తక్కువ దూరంలో బొగ్గు గనులు ఉండి, అనుకూలంగా ఉండే బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం మంజూరు చేయడం లేదు. ఏజెన్సీ పరిసర ప్రాంతంలో కర్మాగారం ఏర్పాటు చేయడం ద్వారా ఆరు జిల్లాలకు లబ్దిచేకూరేది.
- బయ్యారానికి దగ్గరలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని గనులను కేంద్రం గుజరాత్‌లోని ఉక్కు కర్మాగారానికి కేటాయించింది. తాజాగా కిషన్‌రెడ్డి గనుల శాఖ మంత్రి కావడంతో ఈసారి బడ్జెట్‌లో దాని మంజూరుకు ఆటంకాలు తొలగిపోతాయని అందరూ అనుకున్నారు. కానీ ఆ కల సాకారం కాలేదు.
- తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం చివరికి లోక్‌సభ ఎన్నికలకు ముందు గత డిసెంబరులో దానికి సంబంధించిన బిల్లును ఆమోదించింది. విశ్వవిద్యాలయం స్థాపించడానికి రూ.900 కోట్లు మంజూరు కావాల్సి ఉండగా, నిధుల కేటాయింపులు జరగలేదు.
- విభజన చట్టంలో తెలంగాణకు ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర పెద్దలను కలిశారు.
- విభజన చట్టం ప్రకారం హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్-నాగ్‌పుర్ పారిశ్రామిక కారిడార్‌లను మంజూరు చేసి నిధులివ్వాలంటూ గత పది సంవత్సరాలుగా రాష్ట్ర కోరుతోంది. ఈసారీ కూడా వాటిని పట్టించుకోలేదు. బెంగళూరు కారిడార్‌లో హైదరాబాద్‌ను జత చేస్తామని ప్రకటించింది. దీని వల్ల ప్రయోజనాలు తక్కువే అని చెప్పాలి.
- వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు రావాలి. పదేళ్లుగా అవి విడుదల కాలేదు.
- 2019-20 నుండి 2023-24 సంవత్సరాల మధ్య రావాల్సిన గ్రాంట్లు రూ.1,800 కోట్లు ఇంకా పెండింగులోనే ఉన్నాయి.
- తెలంగాణలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని విభజన చట్టంలో చెప్పారు. కొత్త పరిశ్రమలకు ఐదేళ్ల తర్వాత యంత్రాల కొనుగోలుపై పన్ను మినహాయింపులు వర్తిస్తాయని విభజనలో పేర్కొన్నారు. దీని రాష్ట్రానికి పది వేల కోట్లకు పైగా నిధులు రావాలి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిధులు విడుదల కాలేదు.
- తెలంగాణకు ఉద్యాన విశ్వవిద్యాలయంపై కేంద్రం హామీ ఇచ్చింది. కానీ అందుకు చొరవ చూపలేదు. 2014 డిసెంబరు 22న రాష్ట్ర ప్రభుత్వమే కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. దీనికి కేంద్రం నిధులివ్వలేదు.
- విభజన చట్టం ప్రకారం తెలంగాణలో నాలుగు వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయాలి. రామగుండంలో ఎన్టీపీసీ 1,600 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం మాత్రమే జరిగింది. మిగిలిన 2,400 మెగావాట్లవి ఇంకా ఏర్పాటు చేయలేదు.
- విభజన చట్టం ప్రకారం జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి, కానీ ఏర్పాటు కాలేదు. ఐఐఎం, ఐఐటీహెచ్ వంటి ఉన్నత విద్యాసంస్థలను మంజూరు చేయాలని రాష్ట్రం కోరినా కేంద్రం ఆసక్తి చూపలేదు. ఇలా మరెన్నో విభజన హామీలకు కేంద్ర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వలేదు.
వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ - తొమ్మిది ప్రాధాన్యాలతో కేటాయింపులు - Union Budget 2024