Modi Election Campaign in Andhra Pradesh: రాష్ట్రంలో ప్రచారంలో దూసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి నేడు రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుండగా, వీటికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. గోదావరి తీరంలో ప్రజాగళం పేరిట భారీ బహిరంగ సభకు కూటమి నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానితో పవన్ కల్యాణ్, లోకేశ్ ఈ సభలో పాల్గొనున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలోని కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద నిర్వహించే మరో సభలో ప్రధాని మోదీతో కలిసి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వేదిక పంచుకోనున్నారు.
ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుతున్న వేళ గోదావరి తీరంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు కూటమిగా ఏర్పడిన తర్వాత తొలిసారి చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడిలో బహిరంగ సభ నిర్వహించారు.
రెండో సభను రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం గతేడాది మహానాడు నిర్వహించిన మైదాన ప్రాంగణంలో సుమారు 50 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజిన్ సర్కార్ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను సభలో ప్రధాని మోదీ వివరించనున్నారని నేతలు తెలిపారు. ప్రధాని మోదీ సభా వేదిక వద్దకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకోనున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో సభా ప్రాంగణంలో భారీ వేదికల చుట్టూ పందిళ్లు ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో కూలర్లు, ఏసీలు అందుబాటులో ఉంచారు.