MLC Kodandaram Fires on BRS : గత బీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram) ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్(BRS), ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా శాపనార్థాలు పెట్టడం సమంజసం కాదన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించిన పీవీ జిల్లా సాధన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట హుజూరాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని జిల్లావాసులకు హామీ ఇచ్చారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ నియామకం
PV Huzurabad District Sadhana Samithi : రాష్ట్రంలో జిల్లాల పరిశీలనకు గానూ ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. మాజీ ప్రధాని పీవీ పేరిట జిల్లా ఏర్పాటుతో(PV Huzurabad District) రాష్ట్రానికే కాకుండా, దేశానికే గుర్తింపు ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. జిల్లా ఏర్పాటు విషయంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకుల అసహనం ఏ రకంగా అర్థం చేసుకోలేకపోతున్నామని ఆయన దుయ్యబట్టారు.
'దిల్లీలో సైతం మార్పు రావాలి - పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం'
ప్రతిపక్ష పార్టీగా వారు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని, కానీ త్వరలో ప్రభుత్వం కూలిపోతుందని, పడిపోతుందని ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని కోదండరాం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా కాలేదని, పైసలతో ఏమైనా చేయగలమనే అహంభావం బీఆర్‌ఎస్ నేతలకు ఉందన్నారు. వారు అప్రజాస్వామిక ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు మాత్రమే కాకుండా, ప్రజాస్వామిక పాలన ఏడో గ్యారంటీ అని కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీ అనేది ఒక కొత్త బాధ్యతని, దాంట్లో దాపరికం లేదన్నారు. ప్రజలకు చేరువై సేవ చేస్తామన్నారు. ఐకాస కన్వీనర్‌గా తనకు ఎమ్మెల్సీ ఇవ్వటం ఉద్యమకారులకు ఇచ్చిన గుర్తింపన్నారు. తెలంగాణ జన సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేసే ఆలోచన లేదన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకున్నామని, కలిసి పని చేసి అనుకున్నది సాధించామన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దిల్లీలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నామని, దాని కోసం కలిసి పని చేస్తామన్నారు.
"భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట హుజూరాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు నా వంతు సహకారం అందిస్తా. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా శాపనార్థాలు పెట్టడం సమంజసం కాదు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు. పైసలతో ఏమైనా చేయగలమనే అహంభావం బీఆర్‌ఎస్ నేతలకు ఉంది. వారు అప్రజాస్వామిక ధోరణిని ప్రదర్శిస్తున్నారు". - కోదండరాం, ఎమ్మెల్సీ
ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకుల అసహనం అర్ధం కావడంలేదు- ఎమ్మెల్సీ కోదండరాం బీఆర్ఎస్ నేతలు ఇంకా ఆ విషయం గుర్తించలేకపోతున్నారు : కోదండరాం