ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

ETV Bharat / state

"ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కస్టడీలో రఘురామ కృష్ణరాజును కొట్టాం" - RRR Custodial Torture Case

Raghu Rama Krishna Raju Custodial Torture Case: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ, ఉండి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ అడ్డంగా బుక్కయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియోకాల్‌లో సీఐడీ బాస్‌కు చూపించామని, అప్పట్లో విధులు నిర్వహించిన సీఐ, ఎస్సై, సిబ్బందీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి సునీల్‌ కొట్టించారని వారు తెలిపారు. ఈ కేసులో పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు సీఐడీ చీఫ్‌ సెల్‌ఫోన్‌ లొకేషన్‌ కూడా తీసుకున్నారు. దర్యాప్తును కొలిక్కి తెచ్చారు.

Raghu Rama Krishnam Raju Custodial Torture Case
Raghu Rama Krishnam Raju Custodial Torture Case (ETV Bharat)

Raghu Rama Krishna Raju Custodial Torture Case :మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాటి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని సీఐడీ పోలీసులు తనపై రాజద్రోహం కేసు పెట్టి, 2021 మే 14న తనను అరెస్టు చేసి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించి హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జులై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ విభాగాధిపతి సునీల్‌కుమార్, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, దర్యాప్తు అధికారి విజయపాల్, అప్పటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి వారిపై హత్యాయత్నం కేసులు నమోదుచేసి విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో గుంటూరు ఎస్పీ సతీష్‌ కుమార్‌ను మాజీ ఎంపీ కోరారు. ఈ మేరకు ఏఎస్పీని దర్యాప్తు అధికారిగా నియమించారు. విచారణలో భాగంగా పోలీసులు పలువురిని విచారించగా సంచలన విషయాలు బయటకొచ్చాయి.

జగన్ ప్రభుత్వంలో కస్టోడియల్‌ టార్చర్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు - Raghu Rama Krishnam Raju complaint

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కొట్టాం :రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన రోజు రాత్రి ముఖం కనిపించకుండా రుమాలు కట్టుకున్న నలుగురు వ్యక్తుల్ని వెంట తీసుకుని సీఐడీ బాస్‌ కార్యాలయానికి వచ్చారని అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. మాజీ ఎంపీని హైదరాబాద్‌ నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించినప్పుడు విధుల్లో ఉన్న సెంట్రీ అన్ని వివరాలనూ నమోదు చేశారా లేదా అని పోలీసులు విచారించారు. జనరల్‌ డైరీని పరిశీలించడంతో పాటు అప్పుడు విధుల్లో ఉన్న సెంట్రీ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

కాల్‌డేటాతో ధ్రువీకరించుకుని సెంట్రీ ఇచ్చిన సమాచారం ఆధారంగా గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఆ రోజు రాత్రి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ ఉన్నారా లేదా అన్న విషయమై పోలీసులు దృష్టి పెట్టారు. ఆయన కాల్‌డేటా సేకరించి సాంకేతిక ఆధారాలతో ధ్రువీకరించుకున్నారు. విధుల్లో ఉన్న నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, కొందరు సిబ్బందిని పిలిపించి వారినుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కొట్టామని వారు కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత సీఐడీ బాస్‌ నేరుగా ముసుగులేసుకున్న కొందరితో వచ్చి రఘురామను కొట్టారని అందులో వివరించారు.

విజయపాల్‌ కోసం గాలింపు : రఘురామకృష్ణరాజును కస్టడీలోకి తీసుకున్న సమయంలో దర్యాప్తు అధికారిగా గుంటూరు సీఐడీ ఏఎస్పీ విజయపాల్‌ వ్యవహరించారు. కస్టడీలో ఏం జరిగినా అందుకు దర్యాప్తు అధికారే బాధ్యత వహించాలి. రఘురామకు రక్తగాయాలయ్యాయని వైద్యులు వాంగూల్మం ఇవ్వడంతో పాటు సీఐడీ చీఫ్‌ వచ్చారని సెంట్రీ ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఈ కేసులో కీలకంగా మారాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల నుంచి విజయపాల్‌ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయన ఇంటికి నోటీసులు పంపి విచారణకు హాజరుకావాలని కోరినా ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు.

ఎట్టకేలకు పట్టాలెక్కిన కేసు- మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి నోటీసులు! - Raghu Rama krishna Raju Complaint

ఆయన దొరికితే తమ బండారాలన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో నాటి పోలీసు ఉన్నతాధికారులే ఆయనను దాచి పెట్టారని అనుమానిస్తున్నారు. స్మార్టు ఫోన్లు వాడితే లొకేషన్‌ ద్వారా పట్టుకుంటారనే ఉద్దేశంతో కీప్యాడ్‌ ఫోన్‌ వినియోగిస్తూ తప్పించుకు తిరుగుతున్నారని పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి. రఘురామను చిత్రహింసలకు గురిచేసినా అప్పట్లో విజయపాల్‌ నోరుమెదపకపోవడంతో అందుకు నజరానాగా ఉద్యోగ విరమణ చేసేందుకు కొద్ది రోజుల ముందే ఏఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పించారని, పదవీ విరమణ తర్వాత కూడా ఆయన్ని ఓఎస్‌డీగా విధుల్లోకి తీసుకున్నారని పోలీసులు గుర్తు చేస్తున్నారు.

తప్పుడు నివేదికలు :రఘురామకు తొలుత గుంటూరు బోధనాసుపత్రిలో జనరల్‌ మెడిసిన్, ఎముకలు-కీళ్లు, గుండె విభాగానికి చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారిలో కొందరు గాయాలున్నాయని చెప్పగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదికలు తయారు చేయించారు. ఆయనకు ఎలాంటి గాయాలూ లేవని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నీలం ప్రభావతి హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వ పెద్దల నుంచి కింది స్థాయి దాకా అందరూ కూడబలుక్కుని చిత్ర హింసలకు గురిచేయడంతో గతంలో ఈ దారుణాలేవీ బయటకు రాలేదు.

ఆయన శరీరంపై రక్తగాయాలున్నాయని హైదరాబాద్‌లోని సైనిక ఆసుపత్రి గతంలోనే నివేదిక ఇచ్చింది. తాజా విచారణలో భాగంగా కొందరు వైద్యులు.. అప్పట్లో రఘురామ శరీరంపై గాయాలున్నాయని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిర్ధారించారు. దీంతో నాటి పాలకుల మెడకు ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో ఒకరిద్దరు పోలీసులు అప్రూవర్లుగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మీడియా వల్లే బతికాను - గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన రఘురామ - Mla Raghu Rama Raju Met Guntur SP

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details