MLA teach English subject to students:శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు పుట్టపర్తి నియోజవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆంగ్ల విద్యను బోధించారు. నల్లమాడ మండలంలో జరిగే మండల సర్వసభ్య సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే రామాపురంలోని అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులకు మార్చిలో పబ్లిక్ పరీక్షలు ఉన్నాయని సిలబస్ ఎంత వరకు పూర్తి చేశారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
విద్యతోనే మనిషికి సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అందరూ బాగా చదివి 10వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థినిలతో మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని ఆంగ్లం, గణితం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రంలపై విద్యార్థినులు దృష్టి పెట్టాలని కష్టపడితే ఫలితం దక్కుతుందని సూచించారు. అనంతరం పాఠశాలలో రికార్డులను పరిశీలించి విద్యార్థులకు ఎటువంటి లోటు రాకుండా చూడవలసిన బాధ్యత మీ పైన ఉందని ఉపాధ్యాయులకు తెలియజేశారు.