Mithaliraj Exclusive Interview with ETV Bharat : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్-17 ఫీవర్ నడుస్తోంది. మార్చి 22న చెన్నై - గుజరాత్ జట్ల మధ్య పోరుతో ప్రారంభమైన ఈ సీజన్ (IPL 2024), ఉత్కంఠ బరితమైన మ్యాచ్‌లతో క్రికెట్ లవర్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. టికెట్ కొని స్టేడియానికి వెళ్లే ఫ్యాన్స్‌పై ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే, ఇళ్లల్లో కూర్చుని టీవీల్లో చూసే వారూ ఆ బౌండరీల వర్షంతో తడిసి ముద్దవుతున్నారు. గత సీజన్ వరకు 200, 230 స్కోర్లు కొడితే దాదాపు గెలిచేశామనే ధీమాలో ఉండే జట్లు, ఈసారి అంతకుమించి దంచినా, గెలుపుపై ధీమాగా ఉండలేకపోతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో 11 ఏళ్లుగా పదిలంగా ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (263 బెంగళూరు)ను ఈసారి ఇప్పటికే 2 సార్లు తిరగరాశారంటే (హైదరాబాద్ 277, 287) పరుగుల వరద ఏ రేంజ్లో పారుతుందో అర్థం చేసుకోవచ్చు.
రసవత్తరంగా సాగుతోన్న లీగ్‌లో ఇప్పటి వరకు దాదాపు అన్ని జట్లు 6 మ్యాచులు ఆడేశాయి. ఈసారి నిలకడగా రాణిస్తోన్న రాజస్థాన్ జట్టు టేబుల్ టాపర్‌గా కొనసాగుతుండగా, "ఈసాలా కప్ నమదే " అంటూ ప్రతిసారి ఊదరగొట్టే ఆర్సీబీ, చివరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఏ జట్టు ఎలా ఆడుతోంది? ఆర్సీబీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఏం చేయాలి? ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్న మన సిరాజ్ మియా, హార్దిక్ పాండ్య వంటి టీమిండియా ప్లేయర్లకు టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉందా? అన్న వాటిపై మన హైదరాబాదీ, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఎక్స్పర్ట్ మిథాలీ రాజ్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
- ఆర్సీబీ ఈసారీ వరుసగా విఫలమౌతుంది. విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తున్నారు. అలా కాకుండా ఆయన 3వ స్థానంలో వచ్చి, విల్ జాక్స్‌తో ఓపెనింగ్ చేయిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా?
నా దృష్టిలో బెంగళూరు ఈసారి బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించడంలో క్లిక్ కాలేదు. విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఎవరైనా సరే ఒక స్థానంలో నిలకడగా పరుగులు చేస్తున్నప్పుడు, ఆ స్థానం నుంచి తప్పించడం కరెక్ట్ కాదు. బెంగళూరు కావాలంటే ఫాఫ్ డుప్లెసిస్‌కు బదులు విల్ జాక్స్‌ను విరాట్‌కు జోడీగా పంపించాలి. జాక్స్ దూకుడుగా ఆడతాడు కాబట్టి, పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు రాబట్టుకోవచ్చు. డుప్లెసిస్ 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే అతడికి ఉన్న అనుభవంతో మధ్య ఓవర్లలో పరిస్థితులకు తగ్గట్లు ఆడతాడు. అలా చేస్తే జట్టుకు సమతూకం వచ్చే ఛాన్స్ ఉంటుంది.
- చెన్నై బ్యాటర్ శివమ్ దూబే ఈసారి బ్యాటింగ్‌లో అదరగొట్టేస్తున్నాడు. సీఎస్కే అతడికి బౌలింగ్ అవకాశం కూడా ఇచ్చి టీ-20 వరల్డ్ కప్ కోసం ఆల్ రౌండర్‌గా తీర్చిదిద్దే ఛాన్స్ ఉందా?