Swimmer Shyamala 150 KMS Swimming: సముద్రాలను ఈదుతున్న సాహసోపేత మహిళా స్విమ్మర్ గోలి శ్యామల మరో రికార్డు సాధించారు. విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదుకుంటూ లక్ష్యం చేరుకున్నారు. డిసెంబర్ 28న విశాఖ ఆర్కే బీచ్ నుంచి ఆమె ఈతను ప్రారంభించింది. రోజుకు 30 కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని ఈ ఘనత సాధించినట్లు శ్యామల చెప్పారు.
తాజా రికార్డుతో జీవితంలో ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని శ్యామల మరోసారి నిరూపించారు. గతంలో శ్రీలంక నుంచి రామసేతు వరకు సముద్రాన్ని ఈది అందరిని ఆశ్చర్యపరిచారు. గత ఏడాది మార్చిలో పాక్ జలసంధి 30 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల 43 నిమిషాల్లో ఈదారు. అదే విధంగా ఎంతో క్లిష్టమైన కాటలినా ఛానల్‌ను 10 గంటల 4 నిమిషాల 45 సెకన్లలో ఈతకొట్టి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు లక్షద్వీప్‌లో సైతం 45 కిలోమీటర్ల మేర సముద్రాన్ని ఈదారు.
ప్రస్తుతం 51 ఏళ్ల వయసులో సాహసం చేసిన శ్యామలకు కాకినాడ బీచ్ వద్ద ప్రజాప్రతినిధులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. సామర్లకోటకు చెందిన స్విమ్మర్ శ్యామల హైదరాబాదులో స్థిరపడ్డారు. వ్యాపారంలో నష్టపోయి మనోవేదనకు గురైన సమయంలో ఈత నేర్చుకున్నారు. స్మిమ్మింగ్ పట్ల అందరికీ అవగాహన కల్పించాలనే స్మిమ్మర్‌గా మారానని శ్యామల అన్నారు.
"రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా యానిమేషన్ స్టూడియోస్‌లో చాలా మూవీస్‌కి, సిరీస్‌కి పనిచేశాను. కానీ అనుకోకుండా నష్టాలు వచ్చాయి. పది సంవత్సరాల పాటు విజయవంతంగా రన్ చేసిన తరువాత దానిని క్లోజ్ చేయడం చాలా డిప్రెషన్‌కి గురి చేసింది. దాని నుంచి బయటపడటానికి స్విమ్మింగ్ నేర్చుకున్నాను. జీరో లెవల్ నుంచి ఈ రోజు 150 కిలోమీటర్లు స్విమ్ చేయగలిగే స్థాయికి ఎదగగలిగాను. డిసెంబర్ 28వ తేదీన 11 గంటలకు స్టార్ట్ చేశాము. గంటగంటకి లిక్విట్ ఫీడింగ్ తీసుకున్నాను. మధ్యాహ్నం ఒక 30 నిమిషాలు బ్రేక్ తీసుకునేదానిని. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా విశాఖపట్నం నుంచి కాకినాడ వరకూ స్విమ్మింగ్ చేశాను. స్మిమ్మింగ్ పట్ల అందరికి అవగాహన కల్పించాలనేదే నా ఉద్దేశం". - గోలి శ్యామల, స్విమ్మర్
విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు- సముద్ర ఈతలో రికార్డు దిశగా గోలి శ్యామల