Telugu Astronomer Puchcha Ragadeepika Breakthrough Research: అనంత విశ్వంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉంటాయి. శాస్త్రవేత్తలు ఛేదించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మన తెలుగు తేజం, ఖగోళ శాస్త్రవేత్త, పుచ్చ రాగదీపిక ఆధ్వర్యంలోని పరిశోధనా బృందం చిన్న గెలాక్సీలు, వాటిల్లోని బ్లాక్ హోల్స్‌పై చేసిన పరిశోధన, వాటి ఫలితాలకు గుర్తింపు లభించింది.
నేపథ్యం: తెనాలికి చెందిన కేంద్ర ప్రభుత్వ విశ్రాంత సివిల్ ఇంజినీర్ రాజగోపాల్, వీణ విద్వాంసురాలు కనకదుర్గ దంపతుల కుమార్తె రాగదీపిక. వివిధ రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో 12వ తరగతి వరకు విద్యాభ్యాసం సాగింది. ఖగోళ శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో పశ్చిమబెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం (శాంతినికేతన్)లో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (ఫిజిక్స్) పూర్తి చేశారు. ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్‌నకు తోడుగా బంగారు పతకంతో పట్టాను అందుకున్నారు. ప్రతిభే ప్రామాణికంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనాలో పీహెచ్‌డీ చేయడానికి ఆహ్వానం అందుకుని, స్కాలర్షిప్ను సైతం పొందారు.
చిన్న గెలాక్సీల్లో బ్లాక్ హోల్స్‌పై పరిశోధన: గెలాక్సీల నిర్మాణం, పరిణామం, బ్లాక్ హోల్స్ ప్రధానాంశాలుగా పరిశోధనలు సాగించి 2023లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ యుటాలో పోస్ట్ డాక్టరల్ పరిశోధకురాలిగా తన బృందంతో చిన్న గెలాక్సీల్లో 2,500 పై చిలుకు బ్లాక్ హోల్స్ ఉన్నాయని గుర్తించారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో నిర్ధరణ జరిగినవి 500 బ్లాక్ హోల్స్ మాత్రమే. ఈ బృంద పరిశోధనా పత్రాన్ని విశ్వవిద్యాలయం అధికారికంగా గుర్తించింది. ఈ పరిశోధనను తాజాగా ఆస్ట్రాలజీ జనరల్‌లో ప్రచురించారు.
మరిన్ని పరిశోధనలు కొనసాగిస్తాం: చిన్న గెలాక్సీల్లో 0.2 శాతం మాత్రమే బ్లాక్ హోల్స్ ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. మా పరిశోధనలతో ఇవి మూడింతలు అధికంగా అంటే 2 శాతం వరకు ఉంటాయని నిర్ధరణ అయిందని ఆమె తెలిపారు. ఇది భవిష్యత్తు పరిశోధనలకు, చిన్న గెలాక్సీలు వాటిల్లోని బ్లాక్ హోల్స్ పుట్టుక, ఇతర రహస్యాలను కనుగొనడానికి ఉపయోగపడుతుందని బృంద సభ్యులు అన్నారు. ఇకపై మరిన్ని పరిశోధనలు కొనసాగిస్తామని పుచ్చ రాగదీపిక వెల్లడించారు.