Minister Gottipati Ravikumar Review on Heavy Rains in Andhra Pradesh :రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై మంత్రులు గొట్టిపాటి, అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. వర్షాల దృష్ట్యా విద్యుత్ అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అప్రమత్తం చేశారు. ప్రజల ఆస్తి, ప్రాణాలకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని, విద్యుత్ తీగలు తెగిపడిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల ఫిర్యాదులపై అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి గొట్టిపాటి హెచ్చరించారు.
Minister Anagani Satyaprasad on Heavy Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అత్యవసరం పరిస్థితిల్లో తప్ప ఎవరూ బయటకు రావొద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది అలర్ట్గా ఉండాలని వెల్లడించారు. పెన్షన్ పంపిణీలో ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ సిబ్బది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు పెట్టాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.