Ministers Fires on BRS : హనుమకొండ, వరంగల్ జిల్లాలో ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మంత్రులు కొండా సురేఖ, సీతక‌్కలతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని కే-హబ్, పీవీ నరసింహరావు విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. షెడ్యూల్ తెగల విద్యార్థినులకు వసతి గృహాన్ని ప్రారంభోత్సవం చేశారు. కేయూ ప్రహారి గోడ, సమ్మయ్యనగర్ రహదారుల విస్తరణకు మంత్రి శంకుస్థాపన చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి రూ.258 కోట్ల ప్రగతి పనులకు శ్రీకారం చుట్టారు.
గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో తెలంగాణకు ఏమి చేయలేదు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy Fires on BRS : ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. యువతను బీఆర్ఎస్ సర్కార్ విస్మరించిందని ఆరోపించారు. 70 రోజుల్లోనే 30,000ల పైచిలుకు ఉద్యోగాలిచ్చినట్లు స్పష్టం చేశారు. తమది మాటల సర్కార్ కాదని చేతల ప్రభుత్వమని తెలిపారు. గత భారత్ రాష్ట్ర సమితి హయాంలో వర్సిటీ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆక్షేపించారు. 652 ఎకరాల్లో కేయూ చుట్టూ ప్రహారి నిర్మిస్తామని అన్నారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
"వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రూ.258 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. 90 రోజుల్లో నాలుగు గ్యారంటీలను నెరవేర్చాం. సోమవారం భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తాం. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగ పరీక్షలు నిర్వహించడం చేతకాని ప్రభుత్వం బీఆర్ఎస్. అవినీతి అధికారులను తొలగించి నిజాయతీపరులను టీఎస్‌పీఎస్సీలో నియమించాం." - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి
Ministers Visit Joint Warangal District : అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కొండా సురేఖ, పొంగులేటితో కలిసి మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు. దివ్యాంగులకు వీల్‌ఛైర్స్, కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందించారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పానికి అనుగుణంగా పని చేస్తున్నట్లు సీతక్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తుంటే, ఓర్వలేకే ఎమ్మెల్సీ కవిత అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఆమె దీక్షలు దొంగ దీక్షలని సీతక్క ఆక్షేపించారు.