Bhogapuram Greenfield Airport: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు అదనంగా 500 ఎకరాల భూమి కేటాయించాలన్న ప్రతిపాదనపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనాశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుకుని ఉన్న 500 ఎకరాల భూమిని అప్పగించాలంటూ జీవీఐఏఎల్ (GMR Visakhapatnam International Airport Limited) ప్రతిపాదన ఇచ్చారు. అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం ఈ భూమి అవసరం అని జీవీఐఏఎల్ పేర్కొంది. స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా ఉత్తరాంధ్రలో సామాజిక, ఆర్ధిక అభివృద్ధి అంశాలను అధ్యయనం చేయాల్సిందిగా మంత్రుల కమిటీకి ప్రభుత్వం సూచించింది.
ఏవియేషన్ రంగంలో హైటెక్ ఉత్పత్తి, అనుబంధ సేవలు, ఏవియేషన్ హబ్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలనూ అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీఎంఆర్ విశాఖ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భూ కేటాయింపు తర్వాత భూమి అభివృద్ధికి సంబంధించి ఆదాయం వచ్చేలా వివిధ అంశాలను పరిశీలించాలని జీఓఎంకు (Group of Ministers) సూచించారు.