Minister Uttam Reaction On Union Budget 2024 : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిధుల కేటాయింపులో పక్షపాత ధోరణిని అవలంభిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై ఉత్తమ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఉత్తమ్ మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను రాజకీయ ప్రేరేపితమైందిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. ప్రజల కోసం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కాదని ధ్వజమెత్తారు. బీజేపీ మిత్ర పక్షాలైన జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకోడానికి రూపొందించిన బడ్జెట్ అని విమర్శించారు. బిహార్‌కు రూ.41,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.15,000 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించిన కేంద్రం పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించిందని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 11వ బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్రం మొదటిసారి బడ్జెట్‌లో 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం' పేరుతో ప్రత్యేక అధ్యయాన్ని పొందుపరిచారని పేర్కొన్నారు. కానీ 58 పేజీలు, 14,692 పదాలున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మొత్తం ప్రసంగంలో తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రస్తావనను పూర్తిగా దాటవేయడాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించనప్పటికీ, తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షతను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.