Thin Rice Supply in Telangana :రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ వచ్చే ఏడాది జనవరి మాసం నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో ఇవాళ జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. పౌరసరఫరాలశాఖకు సంబంధించిన కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల వాగ్ధానంలో సన్నబియ్యం పంపిణీ అత్యంత కీలకమని మంత్రి ఉత్తమ్ ఉద్ఘాటించారు. నాణ్యమైన బియ్యం వినియోగదారులకు అందించడం ప్రాధాన్యత అని ఆయన వివరించారు. అవసరమైన చోట రాయితీ ధరలకు గోధుమలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ- పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్ డీలర్లకు హెచ్చరించారు. రేషన్ డీలర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు.
రేషన్ డీలర్లకు హెచ్చరికలు : రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టిస్తే సహించేది లేదని, డీలర్‌షిప్ రద్దు చేయడమే కాకుండా జరిమానా కూడా విధిస్తామని మంత్రి ఉత్తమ్ తేల్చిచెప్పారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా అవుతున్న బియ్యం నాణ్యత లోపించాయని, సరిపడా బియ్యం అందడం లేదని మంత్రి పొంగులేటి ప్రస్తావించి ఆందోళన వ్యక్తం చేయగా, మంత్రి ఉత్తమ్ స్పందించారు. ఆయా సమస్యలు పరిష్కరించి పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతలో గణనీయమైన మెరుగుదల ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.