Minister Subhash Inaugurated Gunadala ESI New Hospital:వైఎస్సార్ బీమా పేరుతో గత ప్రభుత్వం కోట్ల రూపాయల కుంభకోణం చేసిందని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుపుతామని అన్నారు. విజయవాడ గుణదల ఈఎస్ఐ నూతన హాస్పటల్ని మంత్రి సుభాష్ ప్రారంభించారు. గత ఐదేళ్ల పాలనలో ఈఎస్ఐ హాస్పటల్ని నిర్వీర్యం చేసి అవినీతి మయం చేసారని ఆరోపించారు. ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేసేందుకు సరైన వైద్య పరికరాలు కూడా లేవన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీని చేపట్టలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ గత ప్రభుత్వ నేతలు పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈఎస్ఐ హాస్పటల్లో ప్రతి రోగానికి వైద్యం చేస్తారని మంత్రి తెలిపారు. పాత భవనం శిథిలావస్థకు చేరుకోవటంతో తాత్కాలిక భవనాన్ని నిర్మించామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగా భవనంలో 100 పడకల ఆసుపత్రి కొనసాగిస్తున్నామని తెలిపారు. 10 లక్షల రూపాయల వరకు ఈఎస్ఐ నుంచి వైద్య చికిత్సకు అవకాశం ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వ నేతలు దళారులతో వ్యవస్థను నడిపించారని ఆరోపించారు. కార్మిక శాఖా మంత్రిని పక్కన పెట్టి సజ్జల, ధనుంజయ రెడ్డి ఈఎస్ఐ వ్యవస్థని భ్రష్టు పట్టించారని మంత్రి ధ్వజమెత్తారు.