Minister Sridarbabu On Seethakka Morphing Video Issue : శాసనసభ ప్రత్యక్ష ప్రసారాల్లోని దృశ్యాలను మార్ఫింగ్ చేసి సహచర మంత్రి సీతక్క గౌరవానికి భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు విజ్ణప్తి చేశారు. శాసనసభ గౌరవం దిగజార్చే ఎలాంటి చర్యలు సహించబోమని తేల్చిచెప్పారు.
తెలంగాణ హైకోర్టు నిర్మాణం : శాసనసభలో తెలంగాణ సివిల్ కోర్టుల సవరణ బిల్లు 2024పై పలువురు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు. హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్‌లో 1,000 కోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేసారు. రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఉన్నత న్యాయస్థాన భవనాలు తెలంగాణ రాష్ట్రం గర్వపడేలా ఉంటాయని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూమిని హైకోర్టు నిర్మాణానికి తీసుకోవడం వల్ల పరిశోధనలకు ఎలాంటి ఆటంకం కలగదని స్పష్టం చేశారు. వ్యవసాయ పరిశోధనల కోసం మరో చోట రెట్టింపు భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
జిల్లా కోర్టులకు నూతన భవనాలు, మౌలిక వసతుల కల్పనపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల కేంద్రం రూపొందించిన పలు చట్టాలను యదాతథంగా అమలు చేసే ఉద్దేశం రాష్ట్రానికి లేదని చెప్పారు. న్యాయ శాఖ ఆ చట్టాలను పరిశీలిస్తోందని తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, పౌర హక్కులకు భంగం కలిగించేలా కేంద్ర చట్టాలు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో తాము కూడా నిరసనలు తెలపడానికి అనేక ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుకు చేశారు.