Minister Ponnam Focus On Reduce Accidents : రాష్ట్రంలో మోటారు వాహన చట్టానికి విరుద్దంగా తిరుగుతున్న 6,936 వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో దీనిని మరింత కఠినతరం చేస్తామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాలు, సిగ్నల్ జంపింగ్ ఇతర సుప్రీం కోర్టు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ లైసెన్స్‌ల రద్దు ఇంకా కఠిన చర్యలు ఉంటాయన్నారు. లక్డీకపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్లో జరిగిన తెలంగాణ రవాణా శాఖ సాంకేతిక అధికారుల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు.
పాశ్చాత్య దేశాల్లో అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు ఇంకా కఠిన శిక్షలు ఉంటాయని, ఇక్కడ కూడా అటువంటి చట్టాలు తెచ్చి ప్రమాదాలను నివారించే విధంగా రవాణా శాఖ యావత్ సిబ్బంది తమ పని విధానంలో మార్పులు తెచ్చి ఇంకా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ట్రాఫిక్ రూల్స్, ఇతర నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు అవుతుందనే భయం పౌరుల్లో రావడానికి రోడ్ సేఫ్టీ, యునిసెఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పక్షాన విద్యా శాఖ నుంచి పాఠశాలలో కూడా అవగాహన కల్పిస్తామన్నారు.
కేంద్ర రవాణా చట్టానికి అనుబంధంగా మరికొన్ని సంస్కరణలు :రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్, ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రజలను రక్షించడానికి అవసరమైన విధి విధానాలపై టెక్నికల్ ఆఫీసర్స్ సమావేశాల్లో కూడా దిశానిర్దేశం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. ప్రజల ప్రాణాలను రక్షించే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.