Vinayaka Chavithi Celebrations 2024 : గణేష్ ఉత్సవాలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహిస్తామని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గణేష్ నిమజ్జన ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్, రోడ్లు - భవనాలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పోలీస్, రవాణా, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
నగర బ్రాండ్ పెంచేలా :ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో త్వరలోనే మరో సమావేశం నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలు ముంబయి తర్వాత అత్యంత వైభవంగా హైదరాబాద్‌లోనే జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంపొందించే విధంగా ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
అధికారులకు ఆదేశాలు : గణేశ్ నిమజ్జన ఉత్సవాలకు అవసరమైన వాహనాలను సమకూర్చడం, మండపాల వద్ద లైటింగ్ ఏర్పాట్లు, విగ్రహాల తరలింపు సజావుగా సాగేందుకు రోడ్ల నిర్వహణ, పారిశుద్ద్య ఏర్పాట్లు, శాంతిభధ్రతలు తదితర అంశాలపై కూలంకశంగా చర్చించామన్నారు. గణేష్ ఉత్సవాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తవ్వాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమైనదన్నారు.