Minister Payyavula Keshav On Jagan: తల్లికి దండం పెట్టని జగన్ 'తల్లికి వందనం' పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. 9 వేల మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా సీఎం సూచనలతో విడుదల చేశామని వెల్లడించారు. ఎన్నో ఇతర ప్రాధాన్యాలు పక్కన పెట్టి మరీ పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించామని తెలిపారు. వచ్చిన 5 వెలల్లోనే తాము పోలవరం కోసం చేసిన దానిలో 5 శాతమైనా జగన్ చేశారా అని ప్రశ్నించారు.
పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు నిర్వాసితుల బాధలు సీఎం చంద్రబాబు కళ్లారా చూశారని గుర్తు చేశారు. పోలవరం నిర్వాసితులకు అండగా ఉండాలని సీఎం చెప్పారని అన్నారు. బాధితులకు ఎప్పుడూ చంద్రబాబు అండగా ఉంటారని, ప్రతి పనిలో మానవీయకోణం ఉండాలని సీఎ అంటారని తెలిపారు.
పట్టిసీమ వల్ల చాలా మార్పులు వచ్చాయి: పోలవరం అనేది ఒక జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు కాదని, రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఇదో గొప్ప వరమని చెప్పారు. రాయలసీమ భూ భాగంలో పట్టిసీమ తర్వాత గణనీయమైన మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. రైతు కష్టాలు తీరుస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నిధులు జమ చేస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చేసినట్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తాము మూసేయలేదని ఎద్దేవా చేశారు. పట్టిసీమ వల్ల రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతోందని తెలిపారు.
'ప్యాలెస్‌లు కట్టుకోవడం జగన్ అలవాటు - ప్రాజెక్టులు కట్టడం మా అలవాటు' (ETV Bharat) 'జగన్‌పై చర్యలు తీసుకోవాలంటే అది లడ్డూ లాంటి అవకాశం - నా లక్ష్యం అది కాదు' : సీఎం చంద్రబాబు
వెలుగులు నింపేందుకు మేం పనిచేస్తున్నాం: ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి రైతుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నామని పయ్యావుల తెలిపారు. పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బనకచర్లకు నీరు వచ్చిందంటే రాయలసీమలోని ప్రతి ఎకరానికీ నీరు అందుతుందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో పోలవరం పనులు ఆపిందెవరో జగన్ చెప్పాలని ప్రశ్నించారు.
రైతులకు అండగా నిలబడాలని చంద్రబాబు రోజూ అంటారని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తాము పని చేస్తున్నామని అన్నారు. పోలవరం నిర్వాసితులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, వారికి గతంలోనూ, ఇప్పుడూ తామే నిధులు కేటాయించామని స్పష్టం చేశారు. తాము ఇచ్చిన హామీలు తమకు తెలుసని, మీరు చెప్పనక్కర్లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. తాము వచ్చాక 74 కేంద్ర పథకాలు మళ్లీ అమలు చేస్తున్నామని, ఏ రాష్ట్రానికీ లేని అప్పు మన రాష్ట్రానికి ఉందంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కారణమని అన్నారు.
రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే భావన జగన్కు అనవసరమని దుయ్యబట్టారు. అనర్హులు పేరిట ఫింఛన్ల తొలిగింపు అని జరుగుతున్న ప్రచారం జగన్ శ్రేణులు సృష్టించిందేనని మండిపడ్డారు. మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు అంటూ అప్పట్లో మాయమాటలు చెప్పారని, ప్రస్తుతం జమిలి ఎన్నికల పేరుతో ప్రజలను జగన్ గందరగోళానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రోడ్ల గురించి ఏమైనా పట్టించుకున్నారా అని పయ్యావుల ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, జగన్ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు. ప్యాలెస్‌లు కట్టుకోవడం జగన్ అలవాటని, ప్రాజెక్టులు కట్టడం తమ అలవాటని అన్నారు.
25 ఏళ్ల భవిష్యత్ ఆదాయంపైనా అప్పులు చేశారు - యథేచ్ఛగా రాజ్యంగ ఉల్లంఘన : పయ్యావుల