Minister Nimmala Ramanaidu Release Water Through Pattiseema Lifts: దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని మంత్రి విడుదల చేశారు.
4, 5, 6 పంపుల ద్వారా 1,050 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అక్కడ యంత్రాలు, మోటార్లకు పూజలు నిర్వహించిన అనంతరం కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం తాటిపూడి జలాశయం నుంచి కూడా నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు.
ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారుతున్నాయని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృథా నీటిని అరికట్టవచ్చన్నారు. ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రాకు బదిలీ చేయించడం చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనమన్నారు. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోందని తెలిపారు. గతంలో పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.
ఇప్పుడు అదే బంగారమైందని మంత్రి గుర్తు చేశారు. కృష్ణా డెల్టాకు తాగు, సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమేనని, తాగునీటి వ్యవస్థను జగన్ విధ్వంసం చేశారని మండిపడ్డారు. పట్టిసీమ నీటిని విడుదల చేయకపోతే లక్షలాది మంది దాహార్తిని ఎలా తీరుస్తారు? ఒక్క చుక్క నీటినీ వృథా చేయొద్దని సీఎం చెప్పారని మంత్రి పేర్కొన్నారు.