Minister Nimmala Meets Central Jalashakthi Minister : పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు సహాయ, సహకారాలు అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పోలవరం ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారని సీఆర్ పాటిల్ తెలిపారన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరులశాఖ మంత్రుల సదస్సుకు హాజరైన నిమ్మల కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లు నిమ్మల చెప్పారు.
2027 నాటికి పోలవరం పూర్తి! : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహాయ, సహాకారాలు అందిస్తున్నందుకు సీఆర్ పాటిల్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మూడు సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించి వర్క్ షెడ్యూల్ విడుదల చేశారని నిమ్మల గుర్తుచేశారు. 2025 డిసెంబర్ నాటికి డయా ఫ్రంవాల్ నిర్మాణం, 2027 డిసెంబర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు అధికారులు, ఏజెన్సీలతో సీఎం రివ్యూలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు.
మూడో కట్టర్‌తో పనులు : డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు కూడా ఇప్పటికే రెండు కట్టర్లతో మొదలయ్యాయని తెలిపారు. మార్చి నుండి మూడో కట్టర్‌తో పనులు చేపడతామని వెల్లడించారు. డయా ఫ్రం వాల్ నిర్మాణానికి సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు మొదలుపెట్టేలా, అవసరమైన డిజైన్స్, సీడబ్ల్యూసీ నుంచి త్వరగా వచ్చేలా సహాకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సందర్భంగా నిమ్మల విజ్ఞప్తి మేరకు త్వరలో పోలవరం సందర్శనకు వస్తానని సీఆర్ పాటిల్ తెలిపారు.