ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెలలపాటు నిరీక్షణకు చెక్ - భవన నిర్మాణదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం - MINISTER NARAYANA ON TOWN PLANNING

టౌన్‌ప్లానింగ్‌లో పారదర్శకత తెచ్చేలా సంస్కరణల అమలుకు నిర్ణయం - టౌన్‌ప్లానింగ్‌ వ్యవస్థలో సంస్కరణలకు సీఎం ఆమోదం తెలిపారన్న మంత్రి నారాయణ

Minister_Narayana
Minister Narayana (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 8:27 PM IST

Minister Narayana on Town Planning System Reforms: పురపాలక శాఖలోని టౌన్ ప్లానింగ్ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకువచ్చేలా వివిధ సంస్కరణలు అమలుకు నిర్ణయిం తీసుకున్నామన్నారు. సమీక్షలో ఈ సంస్కరణలకు సీఎం ఆమోదాన్ని తెలియచేశారని వెల్లడించారు. 15 మీటర్ల కంటే ఎత్తైన భవనాలకు సంబంధించి లైసెన్సుడు సర్వేయర్లు ప్లాన్​ను రుసుము చెల్లించి ఆన్​లైన్​లో పెడితే అనుమతి వచ్చినట్టే అని స్పష్టం చేశారు. ఈ ప్లాన్​లో ఎక్కడ డీవియేషన్లు ఉన్నా సదరు సర్వేయర్ లైసెన్సు రద్దుతో పాటు క్రిమినల్ కేసులు పెట్టేలా చట్ట సవరణ చేస్తున్నామన్నారు.

ఈ విధానం హరియాణా, దిల్లీ, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. లేఅవుట్లలో ప్లాన్ అప్రూవల్ కోసం ఇక నుంచి నెలల తరబడి వేచి ఉండకుండా సింగిల్ విండో విధానం తీసుకువస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, జలవనరులు, అగ్నిమాపక, మైనింగ్, ఎయిర్ పోర్టు అథారిటీ, రైల్వేలు ఇలా అన్ని విభాగాల సర్వర్లను పురపాలక శాఖతో సమన్వయం చేసి పురపాలక శాఖ ద్వారా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఒకే పోర్టల్ ద్వారా నిర్దేశిత రుసుము చెల్లించి ఒకే చోట అనుమతులు పొందేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

డిసెంబరు 31వ తేదీ నుంచి ఈ పోర్టల్ అమల్లోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారన్నారు. ఇక నుంచి మున్సిపాలిటీల్లో టీడీఆర్​ల జారీ విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి, టీడీఆర్​లు జారీ లేకుండా ఆ విలువకు సంబంధించి అక్కడే అనుమతి ఇచ్చేలా మార్పు చేస్తున్నామని వెల్లడించారు. 500 చదరపు అడుగులు దాటిన నివాస భవనాలకూ సెల్లార్ పార్కింగ్​కు అనుమతి ఇస్తామన్నారు. 120 మీటర్ల కంటే ఎత్తైన భవనాల సెట్ బాక్ పరిమితిని 20 మీటర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు.

20 మీటర్ల సెట్ బ్యాక్ నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం అమోదయోగ్యమేనన్నారు. ఎత్తైన భవనాల్లో పార్కింగ్ పోడియంను 5 అంతస్తుల వరకూ అనుమతి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 10 అంతస్తుల కంటే ఎత్తైన భవనాల్లోనూ రిక్రియేషన్​కు ఒక అంతస్తు ఉండేలా అనుమతి ఇస్తామన్నారు. లే ఆవుట్లలో ఇక నుంచి 9 మీటర్ల రోడ్డును మాత్రమే వదిలేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇందులో డీవియేషన్లపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. టీడీఆర్ బాండ్ల విషయంలో త్వరలోనే చర్యలు ఉంటాయని తెలిపారు. 15 రోజుల్లోగా టీడీఆర్ బాండ్లపై సవివర నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. మెప్మా సభ్యుల ఆర్ధిక పురోగతికి సంబంధించి పీ4 విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు - తొలి ఫేజ్​లో 42స్టేషన్లు!

Minister Narayana on CRDA: అమరావతిలో ఐదు ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను నార్మన్ పోస్టర్ సంస్థ రూపోందించిందని పురపాలక, సీఆర్డీఏ శాఖ మంత్రి నారాయణ గుర్తు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నార్మన్ పోస్టర్స్ సంస్థ టెండర్​ను, వారి డిజైన్లను రద్దు చేసిందని, అందుకే మళ్లీ ఈ భవనాల డిజైన్ల కోసం టెండర్లు పిలిచామని తెలిపారు. ఆ టెండర్లు కూడా నార్మన్ పోస్టర్స్ సంస్థకే వచ్చాయని వెల్లడించారు. సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వాటికి ఆమోదాన్ని తెలియచేశామని తెలిపారు. త్వరలోనే వీటి తుది డిజైన్లకు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం ఎలాంటి నోటీసు లేకుండా టెండర్లు రద్దు చేయటంతో నార్మన్ పోస్టర్స్ ఆర్బిట్రేషన్ వేసిందన్నారు. అందుకే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంలో వారికి 9 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని ఆ కారణంగానే ఇప్పుడు మళ్లీ రీటెండర్ పిలవాల్సి వచ్చిందన్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి పనులు త్వరలోనే మొదలు అవుతాయని తెలిపారు. ప్రపంచ బ్యాంకు రుణానికి ఎలాంటి ఇబ్బంది లేదని, దశలవారీగా రుణం చెల్లించేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ముందుకు వచ్చిందన్నారు. రాజధాని అమరావతే అని పార్లమెంటు ఇప్పటికే స్పష్టం చేసి చెప్పిందని తెలిపారు. కేంద్రం అధికారిక గెజిట్​ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

"ఏపీలో మెగాసిటీ నిర్మాణం" - స్థిరాస్తి లేఔట్ అనుమతుల్లో సడలింపులు : మంత్రి నారాయణ

మూడేళ్లలో అమరావతి సిద్ధం - డిసెంబర్​లోగా​ టెండర్లు పూర్తి - క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ

ABOUT THE AUTHOR

...view details