Minister Nara Lokesh Visakha Tour :విశాఖలో మంత్రి నారా లోకేశ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. జిల్లా పార్టీ కార్యాలయంలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలను లోకేశ్ కలిశారు. సమస్యల పరిష్కార వేదికైన ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ క్రమంలో ప్రజల నుంచి తీసుకున్న వినతులను పరిశీలించి ఆ వినతులను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.
విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, లోటుపాట్లపై ఆరా: బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖ జిల్లాలో పాఠశాలలను సందర్శించారు. భీమిలి కస్తూర్బా బాలికల పాఠశాలకు వెళ్లిన ఆయన స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. తరగతి గదులు, లైబ్రరీ, సైన్స్ లేబోరేటరీ, మధ్యాహ్న భోజన వంటశాలను పరిశీలించారు.