Minister Nara Lokesh Participated in IT Serve Synergy Summit in America : మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన లాస్‌వెగాస్ నగరంలో నిర్వహించిన ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో పాల్గొన్నారు. సమ్మిట్ ప్రాంగణంలో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రానూయి, రెవేచర్ సీఈవో అశ్విన్‌భరత్, అలాగే సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాతో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతల గురించి వారికి వివరించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్‌ను లోకేశ్ కోరారు. సులభతరమైన పౌరసేవలకు సహకారం అందించాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేశారు. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు AWS నాయకత్వం ఉపకరిస్తుందని తెలిపారు. స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో AWS క్లౌడ్ సేవలు కీలకపాత్ర వహించే అవకాశాలున్నాయన్నారు.
నారా లోకేశ్ టూర్ అప్డేట్స్ - సత్య నాదెళ్ల, శంతను నారాయణ్‌తో భేటీ