Nallamala Forest Tour : వేసవికి ముందే ఎండలు దంచికొడతున్నాయి. ఇలాంటి సమయంలో పచ్చని ప్రకృతి మధ్య చల్లని వాతావరణంలో కాసేపు సేదతీరాలని మనసు కోరుకోవడం సహజం. ప్రకృతి ఒడిలో రోజంతా సంతోషంగా, ఆహ్లాదంగా గడిపేసి మధురానుభూతుల్ని ఆస్వాదించాలని ఆశించే వారికి నల్లమల స్వాగతం పలుకుతోంది. పచ్చని అందాలు వీక్షిస్తూ పక్షుల కిలకిలరావాలు ఆస్వాదించొచ్చు. జింకలు, నెమళ్లు, సాంబార్, దుప్పులను చూడొచ్చు. వీటితో పాటు బెట్టు ఉడుతలు 390 రకాల పక్షి జాతులు కనువిందు చేస్తాయి. నల్లమలలోని జంతువుల నమూనాలు, వృక్ష సంపద, చెంచుల జీవన విధానాలూ తెలుసుకోవచ్చు. అడవి ప్రయాణంలో ఒక్కోసారి పెద్ద పులులు కనిపిస్తాయి ఇంకెందుకు ఆలస్యం ఓరోజు ప్లాన్ చేసుకోండి!!
ఎక్కడెక్కడ ఎలా వెళ్లొచ్చు :
1. నల్లమల సందర్శనకు అటవీ శాఖ అవకాశం కల్పించింది. పర్యాటకుల సౌకర్యార్థం అటవీ ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. వసతులు కల్పించింది. సందర్శకులు అటవీ అందాలను వీక్షించేందుకు ప్రత్యేక రక్షణ మధ్య జంగిల్ సఫారీ అవకాశం కల్పించారు.
2. ఆత్మకూరు మండలం బైర్లూటి, శిరివెళ్ల సమీపంలోని పచ్చర్ల వద్ద ఎకోటూరిజం కేంద్రాలు, జంగిల్ సఫారీ క్యాంప్‌లను ఏర్పాటు చేశారు. తుమ్మలబయలు, రోళ్లపాడులో సఫారీకి అవకాశం కల్పించారు. బైర్లూటి నుంచి 18 కిలోమీటర్లు అడవి ఒడిలో ప్రయాణించొచ్చు. చిత్రాలు, అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయొచ్చు.
3. ఎకోవాక్, ట్రెక్కింగ్, హెరిటేజ్ వాక్, జంగిల్ సఫారీ, బర్డ్స్, బట్టర్‌ఫ్లై స్కౌట్ ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకునేందుకు వసతులు ఉన్నాయి.
4. ఎన్‌ఎస్‌టీఆర్.కో.ఇన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. లాగిన్ కాగానే బైర్లూటి ఎకో టూరిజం, తుమ్మలబయలు, పచ్చర్ల, , నెక్కంటి ఇష్టకామేశ్వరి, రోళ్లపాడు అభయారణ్యం ప్యాకేజీలు కనిపిస్తాయి. వాటిలో ఇష్టమైన దాన్ని ఎంచుకోవచ్చు.
రాత్రి విడిదికి వీలు :
- బైర్లూటిలో మూడు కాటేజీలు, ఆరు టెంట్లు, రెండు ఫ్యామిలి హౌస్‌లు, పచ్చర్లలో నాలుగు కాటేజీలు, రెండు టెంట్లు ఏర్పాటు చేశారు.
- ఒకరోజు విడిదికి రూ.7,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఆరు సంవత్సరాలు పైబడిన పిల్లలు వెంట వస్తే అదనంగా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఫ్యామిలి హౌస్‌కు ఒకరోజుకు రూ.20,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 8 మంది వరకు ఉండొచ్చు.
- ఉదయం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 వరకు ఇక్కడ ఉండవచ్చు. సఫారీ చేసే వారు ఒకసారి వాహనానికి (10 మందికి) రూ.3,000లు చెల్లించాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌ఎస్‌టీఆర్‌లో లాగిన్ అయితే వీటి వివరాలు చూడొచ్చు.
తిండికి తిప్పలుండదు : ఎకోటూరిజం కేంద్రాల్లో ఏర్పాటు చేసిన రెస్టారెంట్లు పర్యాటకులకు చక్కటి రుచులు పంచుతున్నాయి. కాటేజీల ప్యాకేజీలో భాగంగానే ఆహారం అందిస్తారు. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం చిరుతిళ్లు, రాత్రి భోజనం, మరుసటి రోజు ఉదయం అల్పాహారం, వసతి అన్నీ ఉంటాయి. మధ్యాహ్నం చక్కటి శాకాహారం, రాత్రి చికెన్‌తో భోజనం అందిస్తారు. మరుసటి రోజు ఉదయం టిఫిన్ ఉంటుంది.
Chenchus life style in Nallamala : నల్లమలలో ఒకరోజు.. గిరిపుత్రులతో గడిపేద్దాం రండి
పులులు, అటవీ జంతువుల మధ్య ప్రయాణం - నల్లమల అడవిలో 13 కిలోమీటర్ల రైడ్ - Thummalabailu Jungle Safari