Polavaram Diaphragm Wall Works : పోలవరంలో డయాఫ్రం వాల్ నిర్మాణంలో సవాల్‌గా ఉన్న బంకమన్ను ప్రాంతంలో నిర్మాణానికి ఆఫ్రి కంపెనీ ప్రత్యేక డిజైన్‌ను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా డయాఫ్రం వాల్ పనులను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. వాల్ నిర్మాణం సగం పూర్తయ్యాక ప్రధాన డ్యాం నిర్మాణమూ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మరోవైపు వరదల సమయంలో ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగించేలా సిద్ధమవడం, దాదాపు 500 మీటర్ల మేర బంకమన్ను ఉన్న ప్రాంతంలో నిర్మాణం అనేవి డయాఫ్రం వాల్ నిర్మాణంలో ప్రధాన సవాళ్లు. వీటిని అధిగమిస్తే ఈ నిర్మాణం త్వరగా పూర్తయినట్లేనని ఇంజినీర్లు పేర్కొంటున్నారు. పోలవరం తాజా డీపీఆర్‌ను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని గడువు విధించింది. తప్పనిసరైతే మరో ఏడాది వెసులుబాటు ఇచ్చింది. ఈ గడువులోపు పూర్తయితేనే కేంద్ర సాయం అందుతుందనేది ప్రధాన షరతు. మూడు సంవత్సరాల్లో పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తి చేసి, రెండు కాలువల ద్వారా నీళ్లివ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.
మూడు భాగాలుగా పనులు : డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని మూడు షెడ్యూళ్లుగా విభజించుకున్నారు. రాత్రింబవళ్లు పని చేస్తూ 2026 మార్చి నాటికి పూర్తయ్యేలా దీనికి రూపకల్పన చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే పట్టుదలతో బృంద సభ్యులు ఉన్నారు. ఇది సాధ్యం కావాలంటే క్లే కోర్‌లో నిర్మాణం కీలకం. ఇక్కడ కొన్ని బంకమట్టి పొరలు, ఇసుక పొరలు ఇక్కడ ఉండటంతో నిర్మాణం చాలా సంక్లిష్టం కానుంది. అందుకు మట్టి నమూనాలు తీసి ఆరు రకాలుగా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను అమెరికాలోని నిపుణులకు పంపారు.
పూర్తిగా వైబ్రో కాంపాక్షన్‌తో మట్టిలో సాంద్రత పెంచే పనులు చేయకుండానే ఆ రీచ్‌లో డయాఫ్రం వాల్ నిర్మించేందుకు ఒక ప్రత్యేక డిజైన్‌ను ఆఫ్రి సంస్థ సిద్ధం చేసింది. ఆ వివరాలను విదేశీ నిపుణులకు పంపారు. మొదట ఈ డిజైన్‌తో డయాఫ్రం వాల్ పూర్తి చేసి, ప్రధాన డ్యాం నిర్మాణంలోపు వైబ్రో కాంపాక్షన్ చేయవచ్చనేది ఒక ఆలోచన. దీన్ని విదేశీ నిపుణులు, కేంద్ర జలసంఘం ఆమోదిస్తే నిర్మాణం మరింత సులభమవుతుంది.
మరోవైపు పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులపై గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(జీఆర్‌ఎంబీ) ఛైర్మన్ ఏకే ప్రదాన్, సభ్య కార్యదర్శి అజాగేశన్ స్థానిక క్యాంపు కార్యాలయంలో సీఈ కె.నరసింహమూర్తితో శనివారం సమీక్షించారు. డయాఫ్రం వాల్, గైడ్‌బండ్ ప్రాంతాలను సందర్శించారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. డీఈ రామేశ్వరనాయుడు ఈ రెండు పథకాల గురించి వారికి వివరించారు. ఆయకట్టు పరిధిలో సాగవుతున్న పంటలు, విడుదల చేస్తున్న నీటి వివరాలను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వీటిని ఎంతవరకు కొనసాగించాలనే విషయాలపై చర్చించారు.
2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల - సీఎం ఏమన్నారంటే!
పోలవరం ఎత్తుపై రాజ్యసభలో చర్చ - ఆ విషయంలో తగ్గేదేలేదని వెల్లడి