Types of Parenting Style : కొంతమంది తల్లిచాటు బిడ్డలు ఉంటారు. ఎవరైనా కొత్తవాళ్లు దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తే చాలు భయపడి ఏడవడం మొదలుపెడతారు. వాళ్లు దూరంగా వెళ్తేనే ఏడవడం ఆపేస్తారు. మరికొందరు ఎవరి దగ్గరికైనా నవ్వుతూ వెళ్తారు. వారితో కబుర్లు చెబుతూ ఆడుకుంటారు. మరి కొంతమంది పిల్లలు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉంటారు. స్కూల్లో, ఇంటి బయట తోటి పిల్లలతో ఆటలు ఆడకుండా మౌనంగా కూర్చుంటారు. ఇలా పిల్లల ప్రవర్తన రకరకాలుగా ఉండడానికి తల్లిదండ్రులు పెంపక ప్రభావమే అంటున్నారు నిపుణులు. అయితే, పిల్లల పెంపకాలలో పలు రకాలు ఉంటాయని చెబుతున్నారు. ఇందులో పిల్లలు మంచి వ్యక్తిత్వం ఉన్నవారిగా ఎదగడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం.
అధికారం మొత్తం తల్లిదండ్రులదే!
'నీకేం తెలియదు, నేను చెప్పినట్లు విను, అప్పుడే బాగుపడతావు - నా మాటే శాసనం!' అంటూ పిల్లలను దారిలో పెడుతున్నామనుకుంటారు కొందరు తల్లిదండ్రులు. ఇటువంటి అధికారపూర్వకమైన పెంపకంలో పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకోలేరు. పేరెంట్స్ చెప్పినదాన్ని శిరసావహిస్తూ, ఆ మార్గంలోనే నడవాలి. ఈ రకమైన పెంపకంలో కొన్నిసార్లు పిల్లలపట్ల అమ్మనాన్నలు నిరంకుశత్వంతో ప్రవర్తిస్తారు. కొన్నిరకాల ఆంక్షలతో పెరగడం వల్ల పిల్లలు తమలోని భావోద్వేగాలను వ్యక్తీకరించలేకపోతారు. ఇది క్రమంగా వాళ్లను కుంగుబాటుకు గురిచేస్తుంది. అలాగే తమకంటూ అభిరుచి లేదా మనసుకు నచ్చిన కెరియర్‌ను ఎంచుకునే స్వేచ్ఛ లేకపోవడంతో స్వీయ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. నచ్చిన పని చేయలేకపోయామని నిరాశ, నిస్పృహలకు ఫ్యూచర్లో ఏదో ఒక సమయంలో గురవుతారు.
"పేరెంటింగ్ అనేది రకరకాలుగా ఉంటుంది. పేరెంటింగ్ అనేది పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఉన్న సంబంధం. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను పూర్తి కంట్రోల్లో ఉంచుతారు. పిల్లల ఇష్టాలు తెలుసుకోకుండా నేను చెప్పిందే వినాలని ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఇలాంటి పెంపకంతో వాళ్ల మనసు ఏంటో తెలుసుకోకుండా పెరుగుతారు. ఇలాంటి పిల్లలు భయంగా లేదా రెబల్‌గా పెరుగుతారు." -డాక్టర్ పింగళి శ్రీలక్ష్మీ (సైకియాట్రిస్ట్)
నిర్లక్ష్య ధోరణితో!
ఈ రకమైన పెంపకంలో పేరెంట్స్ పిల్లలపట్ల శ్రద్ధవహించరు. మంచి చదువు, దుస్తులు, ఆహారం వంటి అవసరాలు తీర్చడంతో తమ బాధ్యత తీరిందనుకుంటారు. పిల్లల కోసం సమయాన్ని కేటాయించి వాళ్ల ఆలోచనలను పంచుకోవాలని పేరెంట్స్‌కు అనిపించదు. దీంతో చిన్నవయసులోనే వారు ఒత్తిడి, ఆందోళనలకు లోనవుతారు. ఒంటరిగా ఫీల్ అవుతారు. హైపర్‌యాక్టివ్‌గా ఉంటూ, తీవ్రమైన కోపం, నిర్లక్ష్య ధోరణి, అవిధేయత ప్రదర్శిస్తారు. చదువులో కూడా వెనకబడతారు. మంచి వ్యక్తిగత నైపుణ్యాలు కొరవడతాయి. ముఖ్యంగా ఇలాంటి వారిలో భావోద్వేగాల నియంత్రణ ఉండదు. జీవితంలో మానవ సంబంధాలను మెరుగుపరచుకోలేరు.
నీ ఇష్టం బాబూ!
అడిగినదానికల్లా ఓకే చెబుతూ, నీ ఇష్టమొచ్చినట్లు చేయి అంటూ పూర్తి స్వేచ్ఛనిచ్చే పేరెంట్స్ వల్ల కూడా పిల్లలు మంచి భవిష్యత్తును పొందలేరు. ఇలా కాకుండా చిన్నతనం నుంచి సరైన మార్గదర్శకం చేస్తూ, వాళ్ల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి. పిల్లల కోసం ప్రత్యేకంగా టైమ్‌ని కేటాయించి భావోద్వేగాలను సమన్వయం చేయడం నేర్పాలి. స్ఫూర్తి కథనాలు చెబుతూ వారిని నిత్యం ప్రోత్సహించాలి. పేరెంట్స్ జాలి, దయ, ప్రేమ వంటివి పిల్లలపై చూపిస్తేనే, తిరిగి అది ఇతరులకు వాళ్లు అందించగలుగుతారు. అప్పుడే వాళ్లలో ఆరోగ్యకరమైన ఎదుగుదల కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అల్యూమినియం పాత్రల్లో వంట ప్రమాదకరమా? - డాక్టర్లు ఏం చెప్తున్నారంటే!
రూ.40కోట్లు పలికిన 'నెల్లూరు ఆవు' - బహిరంగ వేలంలో ప్రపంచ రికార్డు