Vijayawada Footpaths Encroachment : ఫుట్‌పాత్‌లు ఎక్కడున్నాయి? అసలు కనిపిస్తే చూడాలని ఉందని విజయవాడ వాసులు అంటున్నారు. ఎందుకంటే పాదచారుల బాటలు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురయ్యాయి. వాణిజ్య ప్రాంతాల్లో అయితే దుకాణాలు, వాహనాల పార్కింగ్ కాలిబాటలపైనే ఉంటున్నాయి. నడిచేందుకు దారే కరవైంది. దీంతో ప్రమాదాలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి.
విజయవాడలో అన్ని రోడ్లు కలిపి సుమారు 1337 కిలోమీటర్లు ఉన్నాయి. వీటిలో 20,000ల మీటర్లలో ఫుట్‌పాత్‌లు వేయగా వీటిలో 6000ల మీటర్లకు పైగా ఆక్రమణలకు గురైనట్లు ఓ అంచనా. బెంజ్ సర్కిల్ నుంచి రాజీవ్ గాంధీ పార్కు వరకు కాలు తీసి కాలు పెట్టే చోటే లేదు. ఈ ప్రాంతాల్లో హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, ఫ్యాన్సీ స్టోర్లు, ఎలక్ట్రానిక్స్ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది రోడ్డుపైకి మెట్లు, ర్యాంపులు నిర్మించారు. ఏలూరు రోడ్డులో అయితే ఫర్నిచర్, పుస్తకాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ దుకాణదారులు బహిరంగంగానే ఆక్రమించి ఉత్పత్తులను కాలిబాటలపైనే ప్రదర్శనకు ఉంచుతున్నారు.
Footpath Problems in Vijayawada : నగరంలో చాలావరకు ఫుట్‌పాత్‌లు లేక రోడ్లపైనే నడవాల్సి వస్తోంది. ఈ సమయంలో ఎటునుంచి వాహనం వచ్చి ఢీకొడుతుందో అని పాదచారులు భయపడుతున్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను కోల్పోతున్నారు. చాలా ప్రాంతాల్లో కాలిబాటలు నిర్మించకపోవడంతో బాటసారులు నడవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. రాకపోకలు ఎక్కువగా ఉండే బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో పరిస్థితి మరీ దారుణం.
ఇక్కడ సైడ్ కాలువలు, నడక దారులనూ ఆక్రమించి చాలాచోట్ల మెట్లు కట్టేసి పార్కింగ్ ప్రదేశాలుగా మార్చేశారు. గవర్నర్‌పేట, వన్‌టౌన్‌లో కేఆర్ మార్కెట్ ప్రాంతాల్లో పండ్ల వ్యాపారులు, వస్త్ర, బంగారు దుకాణాల వారు ఫుట్‌పాత్‌లను ఆక్రమించేశారు. ఈ స్థలాన్ని వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. పాదచారులు సురక్షితంగా నడిచేందుకు కాలిబాటలు అత్యవసరం. ఈ దిశగా నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టాలని విజయవాడ వాసులు కోరుతున్నారు.
''ఫుట్‌పాత్‌లు లేక రోడ్లపైనే నడవాల్సి వస్తోంది. ఎటునుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో అని పాదచారులు భయపడుతున్నారు. ఏటేటా పెరుగుతున్న ప్రమాదాలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను కోల్పోతున్నారు." - విమల, సుధీక్షణ్ ఫౌండేషన్ నిర్వాహకురాలు
''చాలా ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు నిర్మించకపోవడంతో ప్రజలు నడవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు చాలా చోట్ల కాలిబాటలను ఆక్రమించి వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన ఫుట్‌పాత్‌లపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. " - విశ్వేశ్వరరావు, విజయవాడ