Minister Nadendla Manohar Inaugurate Paddy Purchase Centre :గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో పర్యటించిన మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడలేదు : వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.11 లక్షల కోట్లు అప్పులు మిగిల్చినా రబీ సీజన్లో రైతులకు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలు రూ.1,674 కోట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేసిన విషయాన్ని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు 50% రాయితీతో రైతులకు టార్పాలిన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. గత ప్రభుత్వం రూ.3,300 కోట్లతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఏ విధంగానూ ఉపయోగపడలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.
"రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3,300 కోట్లతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు ఏ రైతుకు ఉపయోగపడలేదు." : - నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ మంత్రి