Minister Lokesh Participated in Closing ceremony of Temple Expo :‘మన సంస్కృతిలో ఆలయాలు, పండుగలు, పూజలు కీలకం. పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇచ్చే పద్ధతిని పక్కనపెట్టి పురాణాలు, ఆచారాల గురించి చెప్పే పుస్తకాలు ఇవ్వాలి. తొమ్మిదేళ్ల మా అబ్బాయి దేవాంశ్‌కు అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నా. సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ కంటే మన హనుమాన్ శక్తిమంతుడు అని చిన్నారులకు చెప్పాలి. హ్యారీపోటర్ కథల కంటే మన పురాణేతిహాసాలు ఇంకా బాగుంటాయని వివరించాలి. ఎవెంజర్స్ ఎండ్ గేమ్, కెప్టెన్ అమెరికా, సినిమాల కంటే మన శ్రీకృష్ణుడి లీలలు, శ్రీరాముడి గొప్పతనం గురించి చెప్పాలి’ అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
తిరుపతిలో ‘టెంపుల్ మహాకుంభ్’ పేరుతో ‘టెంపుల్ కనెక్ట్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన (ఐటీసీˆఎక్స్)-2025లో బుధవారం ముగిసింది. ముగింపు సదస్సులో లోకేశ్ మాట్లాడారు. ‘ఆలయాల పాలనా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శం. రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల సేవలన్నీ వాట్సప్ ద్వారా అందుబాటులోకి తెచ్చాం. త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సేవలు కూడా వాట్సప్ వేదికగా తీసుకొస్తాం.
తిరుమల సహా రాష్ట్రంలోని ఆలయాల్లో భారీ క్యూ లైన్లు లేకుండా, భక్తులు ఎక్కువ సమయం వేచి చూడకుండా చర్యలు తీసుకుంటాం. ఏఐ, డ్రోన్ వంటి సాంకేతికతను ఉపయోగించి రద్దీ నిర్వహణ, నియంత్రణ చేస్తాం. ఇదే సమయంలో సంప్రదాయాలనూ కాపాడతాం. ఆధ్యాత్మిక, ఆలయాల పర్యాటకంలో ఏపీ అగ్రగామిగా ఉంది. ప్రధాన ఆలయాల్లో వైదిక సంప్రదాయాలను నిలబెట్టేందుకు వైదిక కమిటీలు ఏర్పాటు చేశాం. 73 దేవాలయాల అభివృద్ధి, పునరుద్ధరణకు రూ.134 కోట్లు మంజూరు చేశాం.
విధాన రూపకర్తలు, నిపుణులు, ఆలయాల నిర్వాహకులను ఐటీసీఎక్స్ ఒకచోటకు చేర్చింది. ఐటీసీఎక్స్ చొరవ తీసుకుని దేవాదాయ శాఖ మంత్రుల సదస్సు నిర్వహిస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇందుకు తొలి వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నా’ అని లోకేశ్ చెప్పారు. రానున్న ఐదేళ్లలో లక్ష దేవాలయాలను ఏకతాటిపైకి తీసుకొస్తామని ఐటీసీఎక్స్ నిర్వాహకులు ముగింపు సందర్భంగా వెల్లడించారు. సనాతన బోర్డును సమర్థిస్తున్నామని సమాధానమిచ్చారు.