ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విద్యార్థులు ధైర్యంతో ముందడుగు వేయాలి' - మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన లోకేశ్ - INTER MID DAY MEAL SCHEME IN AP

మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడిన లోకేశ్ - విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లాంఛనంగా ప్రారంభం

Inter Mid Day Meal Scheme in AP
Inter Mid Day Meal Scheme in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2025, 1:07 PM IST

Updated : Jan 4, 2025, 3:53 PM IST

Inter Mid Day Meal Scheme in AP :జీవితమనే పరీక్షను జయించటమే విద్యార్థులకు అసలైన సవాల్ కావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. విద్యార్థులు పరీక్షల కోసం జీవితాల్ని పణంగా పెట్టొద్దని ఆయన పిలుపునిచ్చారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం హామీ ఎన్నికల ముందు ఇవ్వకపోయినా అమలు చేశామని తెలిపారు. తాము రోడ్లు బాగుచేస్తున్నాం కాబట్టే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే రోడ్డెక్కుతానంటున్నాడని ఎద్దేవాచేశారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రజల్లో నమ్మకాన్ని పెంచి ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌తో విద్యావ్యవస్థకు గత వైభవం తెస్తామని లోకేశ్ స్పష్టంచేశారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నారా లోకేశ్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ఈ ఏడాది 27.39 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరానికి 85.84 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు.

విద్యార్థుల పుస్తకాలు పరిశీలించి పలు ప్రశ్నలు అడిగిన లోకేశ్ (ETV Bharat)

అలాంటి సినిమా డైలాగులు సరికాదు: గాజులు తొడుక్కున్నారా, ఆడపిల్లలా ఏడవొద్దు అంటూ మహిళల్ని తక్కువ చేసి చూపే సినిమా డైలాగులు సరికాదని నారా లోకేశ్ అన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ మహిళల్ని గౌరవించే చర్యలకు శ్రీకారం చుట్టామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకనే ప్రైవేటు విద్యాసంస్థలకు పిల్లల్ని తల్లిదండ్రులు పంపుతున్నారని విమర్శించారు. కేజీ నుంచి పీజీ వరకూ ప్రభుత్వ విద్యాలయాలను ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.

విద్యాలయాలు రాజకీయాలకు దూరంగా ఉండేలా: వచ్చే పరీక్షల్లో విద్యార్థులకు మార్కులు తగ్గితే, శాఖా పరంగా తనకూ మార్కులు తగ్గినట్లేనన్నారు. విద్యా శాఖ తాను తీసుకుంటానంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టంతో కూడుకున్న శాఖని ఆశ్చర్యం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. విద్యాలయాలు రాజకీయాలకు దూరంగా ఉండేలా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చర్యలు తీసుకున్నామన్నారు. నేటి తరం విద్యార్థులు భవిష్యత్తు జాబ్ క్రియేటర్స్​గా మారేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలకు విద్యార్థుల్ని తరలించే చర్యలకు స్వస్తి పలికామన్నారు.

వాటి నియంత్రణలో భాగస్వాములు కావాలి: 10వ తరగతి వరకూ తానూ యావరేజ్ విద్యార్థినేనన్న లోకేశ్, ఇంటర్​లో తనను ఇప్పటి మంత్రికి నారాయణకు చంద్రబాబు అప్పగించటంతో తన విద్యా విధానంలో మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. విజన్ 2047 సాకారం కోసం విద్యా శాఖతో పాటు అన్ని శాఖలు ఎంతో కష్టపడాలని కోరారు. ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ కోసం చేసే యుద్ధంలో విద్యార్థులు, పోలీసులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంజాయి కుటుంబాలను నాశనం చేస్తుందని గ్రహించి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలన్నారు. 'గంజాయి వద్దు బ్రో' నినాదం అందరి విధానం కావాలని లోకేశ్ సూచించారు. విజయవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈసారి మార్కులు 10 శాతం ఎక్కువ తెచ్చుకుంటే విద్యార్థులకూ మెరుగైన సౌకర్యాలు వస్తాయని లోకేశ్ వెల్లడించారు. కళాశాల బాగు కోసం విద్యార్థులు అడిగిన పలు వసతులకు మంత్రి వెంటనే ఆమోదం తెలిపారు. విద్యార్థులు ఇటీవల వచ్చిన బుడమేరు వరద తదనంతర ఇబ్బందులు లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. అన్నింటి పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు.

ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో మంత్రి లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల పుస్తకాలు పరిశీలించి పలు ప్రశ్నలు అడిగారు. మీలో ఒక్కడిగా తనను భావించి ఏం చేస్తే బాగుంటుందో సలహాలు సూచనలు ఇవ్వండన్నారు. విద్యార్థులకు ఇది ఎంతో కీలక దశ అని. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు ఇప్పటి నుంచే దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలని సూచించారు. డ్రగ్స్ వాతావరణం మీ పరిసరాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయండని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు.

"విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలి. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా కృషి చేస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలి. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని తద్వారా మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడం మీ చేతుల్లోనే ఉంది." - నారా లోకేశ్, విద్యాశాఖ మంత్రి

'మంగళగిరిలో 2019లో నేను ఓడిపోయాను. కానీ పట్టుదలతో మంగళగిరిలో రికార్డుస్థాయి మెజారిటీతో గెలిచాను. జీవితంలో గెలుపు ఓటములు సహజం. పరీక్షలు తప్పినందుకే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటన్నారు. విద్యార్థులు ధైర్యంతో ముందడుగు వేయాలి. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించాం. అందుకే ప్రముఖుల పేరుతో పథకాలు ప్రారంభించాం' అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వం మాదిరి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం తమది కాదన్న లోకేశ్, ప్రజలతో మమేకమై ముందుకెళ్లే ప్రభుత్వం తమదని అన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఇచ్చిన ప్రతీ హామీ ఓ క్రమపద్ధతిలో అమలు చేస్తామన్నారు. సూపర్ 6 పథకాల అమలును చేసి చూపుతామని లోకేశ్ స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఇన్​ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు. పాయకాపురం జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్​లను లోకేశ్ స్వయంగా పరిశీలించారు.

విద్యార్థులకు అలర్ట్ - ఆ తరగతుల్లో ఇంటర్నల్ మార్కుల విధానం!

'మమ్మల్ని విడిచి​ వెళ్లొద్దు' - ఉపాధ్యాయురాలి రిటైర్మెంట్​లో కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు

Last Updated : Jan 4, 2025, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details