Ind vs Pak 2025 :ఐసీసీ టోర్నీ అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ అందరి కళ్లు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసమే. క్రికెట్ ప్రపంచమంతా దృష్టిసారించే ఆ పోరు మళ్లీ ప్రారంభమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా ఇవాళ ఈ రెండు జట్లూ అమీతుమీ అంటూ బరిలోకి దిగాయి. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిదే. ఇది ఓడితే టోర్నీ నుంచి ఆ జట్టు నిష్క్రమించినట్లే.
90వ దశకం తర్వాత మళ్లీ ఇంత కాలానికి ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ ఆనందమంతా ఆవిరైపోతుంది. అందుకే ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో రిజ్వాన్ బృందం ఉంది. కానీ పాక్‌కు రోహిత్‌సేన అవకాశం ఇవ్వకపోవచ్చు. ఈ మ్యాచ్ గెలిచి పాకిస్థాన్‌ను ఇంటికి పంపించి, తాము సెమీస్ చేరాలని భారత జట్టు భావిస్తోంది. తన మొదటి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌పై గెలుపొందిన సంగతి తెలిసిందే.
జై షాతో లోకేశ్ సమావేశం : ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు నిర్వహించారు. దుబాయ్ స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేశ్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), దర్శకుడు సుకుమార్, సానా సతీష్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. తనయుడు దేవాన్ష్‌తో కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు లోకేశ్ ఐసీసీ ఛైర్మన్ జై షాతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఆయనతో చర్చించారు. ఈ మేరకు లోకేశ్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.