Minister Konda Surekha Severe Comments On BRS : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని కేసీఆర్ను నమ్మి ప్రజలు రెండు సార్లు అధికారంలోకి తెస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టారని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం శ్రీ ఉమామహేశ్వర దేవాలయం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రిగా మొట్టమొదటిసారి అచ్చంపేట నియోజకవర్గానికి కొండ సురేఖ రావడంతో మంత్రికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు.
పార్టీ ఫండ్ కింద రూ.1,500 కోట్లు దాచుకుంది :అనంతరం శ్రీఉమామహేశ్వర దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను లూటీ చేసి, పార్టీ ఫండ్ కింద రూ.1,500 కోట్లు దాచుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేస్తుంటే జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవ కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ అవకాశం రాదని కొందరికి మాత్రమే వస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పాలకమండలి ఛైర్మన్, సభ్యులు దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దేవాలయం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.