Minister Surekha Apologized to Actress Samantha : నటి సమంతకు సంబంధించి బుధవారం తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ తాజాగా స్పందించారు. ఈ మేరకు నటి సమంతకు ఆమె క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని, కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని వివరణ ఇచ్చారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అంటూ పేర్కొన్నారు. తన వ్యాఖ్యల వల్ల ఆమె కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, అన్యద భావించవద్దని మంత్రి సురేఖ కోరారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
"నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే. కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బ తీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే, బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. అన్యద భావించవద్దు." - కొండా సురేఖ, మంత్రి
అసలేం జరిగిందంటే :అక్టోబరు 2న హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. 'కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. సమంత-నాగ చైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్. గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ ఇబ్బందులకు గురి చేశారు. హీరోయిన్స్ తొందరగా పెళ్లిళ్లు చేసుకుని, సినిమాలు విడిచి వెళ్లిపోవడానికి కేటీఆర్‌నే కారణం. కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి, వారిని కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు పెట్టారు. బ్లాక్ మెయిల్ చేసి, వాళ్ల జీవితాలతో ఆడుకున్నారు. కేటీఆర్ మాదిరిగానే అందరూ ఉంటారు అని అనుకోవద్దు.' అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.