Minister Komatireddy visit Brahmana Vellemla :రాష్ట్రంలో కేసీఆర్ దిగిపోతే పీడపోయిందని, ప్రజలందరూ కొబ్బరికాయలు కొడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy) పేర్కొన్నారు. ఇవాళ ఆయన, తన స్వగ్రామం బ్రహ్మణ వెల్లంలలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలసి రూ.67 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.
Minister Komatireddy fires on KCR :ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన స్వగ్రామం బ్రహ్మణ వెల్లంలలోకి రాగానే మధురానుభూతి వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తన బలం, బలగం బ్రాహ్మణ వెల్లంలనే అని మంత్రి స్పష్టం చేశారు. స్వగ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ నుంచి రోజుకో నాయకుడు కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్తున్నారని, బీఆర్ఎస్లో(BRS) చివరికి మిగిలేది ఆ నలుగురేనని మంత్రి ఎద్దేవా చేశారు.
Komatireddy on SLBC Project : కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పేరు వస్తుందని, గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ బ్రాహ్మణ వెల్లంల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని మంత్రి మండిపడ్డారు. రాబోయే వానాకాలంలోపు బ్రాహ్మణ వెల్లంలకు కాలువలు తీయించి, చెరువులు నింపి సాగర్ నీళ్లతో సాగుకు నీరందిస్తానని గ్రామస్థులకు మంత్రి హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేసి సాగు నీటిని అందిస్తామన్నారు.