Minister Komatireddy On Attack On Allu Arjun House :సంధ్య థియేటర్లో జరిగిన ఘటన అంశంపై ప్రతిపక్షాలు రాజకీయాలను చేసి రాద్ధాంతం చేయడం మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పుష్ప సినీ నిర్మాత నవీన్‌తో కలసి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. మైత్రి మూవీ క్రియేషన్స్ తరఫున నిర్మాత నవీన్, శ్రీతేజ్ కుటుంబానికి 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై ఆయన స్పందించారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనను ఖండిస్తున్నా :అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సినీ హీరోల, నిర్మాతల ఇళ్లపై దాడి చేయడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. అలా చేస్తే చర్యలు తప్పవని, చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం మానుకోవాలన్నారు. ఇలాంటి ఘటనల విషయంలో పోలీసు శాఖ చూసుకుంటుందని అన్నారు.
తెలంగాణలో సినీ పరిశ్రమను అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందించి ముందుకు తీసుకెళ్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమ విషయంలో సానుకూల దృక్పథంతో ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనపై ప్రతినిత్యం ఆరా తీస్తున్నారన్నారు. శ్రీతేజ్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నట్లుగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.