Minister Komatireddy Venkat Reddy on Pending Roads : రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని, అధ్వాన్నంగా మారిన రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆర్అండ్బీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గత అయిదేళ్లుగా రోడ్లు నిర్మించక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ ప్రభుత్వం రాగానే వెంటనే కార్యాచరణ చేపట్టినప్పటికీ ఎన్నికల కోడ్ రావడం వల్ల రోడ్ల నిర్మాణ పన్ను వల్ల పనులన్ని పెండింగ్‌లో పడిపోయాయని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణం ప్రారంభించి 24 గంటలు పనిచేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి టిమ్స్, నిమ్స్, హైదరాబాద్ కలెక్టరేట్, సచివాలయంలో రోడ్లు, పార్కింగ్ తదితర అంశాలపై మాట్లాడారు. సచివాలయంలో 30 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన పార్కింగ్ పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఆదేశించారు. పార్కింగ్ షెడ్స్ లేకుండా బిల్డింగ్ ప్లాన్‌కు ఎలా అనుమతులు ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. సోలార్ పార్కింగ్‌కు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రికి తెలిపారు.
భవన నిర్మాణాల పనుల్లో జాప్యంపై మంత్రి ఆగ్రహం :నాలుగు టిమ్స్ ఆస్పత్రుల భవన నిర్మాణాల జాప్యంపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణాలకు నిధుల కొరత లేకపోయినప్పటికీ పనుల్లో జాప్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీలైతే సగం భవనం నిర్మాణం పూర్తికాగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి సమాంతరంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.